భారత్ కోసం విరాళాలు.. టెర్రరిస్టులకు ఇచ్చిన ఎన్జీవోలు 

భారత్ కోసం విరాళాలు.. టెర్రరిస్టులకు ఇచ్చిన ఎన్జీవోలు 

వాషింగ్టన్ డీసీ: కరోనాతో కష్టాల కడలిలో చిక్కుకున్న భారత్‌ను ఆదుకుంటామని చెప్పి అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు భారీ కుంభకోణానికి తెరలేపాయి. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఎన్జీవోలు ఇండియాను ఆదుకుంటామని చెప్పి కొందరు దాతల నుంచి భారీ మొత్తంలో విరాళాలు సేకరించి ఆ డబ్బులను టెర్రరిస్టు గ్రూపులకు తరలించాయి. భారత్‌కు సాయం పేరుతో ఏప్రిల్ 27, 28 తేదీల్లో విరాళాలను సేకరించి.. ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం, మత ఛాందసవాదులు, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేతుల్లో పోశాయని డిస్‌‌ఇన్‌ఫ్లో ల్యాబ్ నివేదిక వెల్లడించింది. దీన్ని కొవిడ్ కుంభకోణం 2021గా అభివర్ణించిన డిస్‌ఇన్‌‌ఫ్లో ల్యాబ్.. మానవ చరిత్రలో అత్యంత చెత్త స్కామ్ ఇదని పేర్కొంది. 

ఫండ్స్ సేకరించిన వాటిలో ఇమానా ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (ఐఎంఏఎన్‌ఏ) అనే సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ దాదాపు రూ.8.7 కోట్లు విరాళాలు సేకరించిందని సమాచారం. ఇలా సేకరించిన మొత్తం దాదాపు రూ.158 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీటిలో కొంత మొత్తాన్ని ఖర్చు చేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని కొనుగోలు చేసి భారత్‌కు అందించినట్టు ఐఎంఏఎన్‌‌ఏ తెలిపింది. అయితే, ఈ సంస్థ నుంచి ఎలాంటి సాయమూ అందలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.