మనిషివా, రోబోవా.. 101 అంతస్తుల బిల్డింగ్ను ఎలాంటి తాడు, నిచ్చెన లేకుండా ఎలా ఎక్కినవ్ భయ్యా !

మనిషివా, రోబోవా.. 101 అంతస్తుల బిల్డింగ్ను ఎలాంటి తాడు, నిచ్చెన లేకుండా ఎలా ఎక్కినవ్ భయ్యా !

ఒక ఐదు అంతస్తుల మేడ ఎక్కడానికే ఆపసోపాలు పడుతుంటాం. లిఫ్ట్ ఎక్కడ అని చెక్ చేస్తుంటాం. ఒకవేళ ఎక్కినా అక్కణ్నించి కిందికి చూస్తే వామ్మో కళ్లు తిరుగుతున్నాయ్ అంటుంటాం. అలాంటిది 101 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాడు ఓ వ్యక్తి.. వినటానికే షాకింగ్ గా ఉంది కదా. ఒక్కో మీటర్ పైకి వెళ్లే కొద్ది పెరిగే పీడనం, గాలిని తట్టుకుని.. అంతపెద్ద ఆకాశ హర్మ్యాన్ని ఎక్కి చరిత్ర సృష్టించిన వ్యక్తి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. నువ్వు మనిషివా.. రోబోవా.. అంత పెద్ద బిల్డింగ్ ఎలా ఎక్కావ్ భయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

అమెరికాకు చెందిన రాక్ క్లైంబర్ అలెక్స్ హోనాల్డ్.. 101 అంతస్తుల బిల్డింగ్.. అంటే 508 మీటర్ల ఎత్తు ఉండే బిల్డింగ్ ను ఎక్కి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. తైవాన్ తైపీ సిటీలో ఉన్న 508 మీటర్ల భవంతి (1667 ఫీట్లు).. అంటే దూరంలో కొలిస్తే అరకిలోమీటరుంటుంది. బిల్డింగ్ L షేప్ కార్నర్ నుంచి ఎక్కడ ప్రారంభించిన అలెక్స్.. ఎడ్జ్ లలో ఉండే డెకరేటివ్ ఆకృతులనే మెట్లుగా మార్చుకున్నాడు. నున్నగా జారేటట్లుగా ఉండే ఈ ఆకృతుల ద్వారా ప్రాణాలను గాల్లో పెట్టి చేసిన సాహసం చూస్తే ఎవ్వరికైనా బ్లడ్ ఒక్కసారిగా 120 దాటకమానదు.

అసలు సినిమా అక్కడే..

తైపీలోని 101 ఫ్లోర్ ల బిల్డింగ్ డిజైన్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఒకానొక దశకు చేరుకున్న తర్వాత పట్టుకోవడానికి గ్రిప్ కూడా లేని భాగం వస్తుంది. ఒక్కో సెగ్మెంట్ లో 8 ఫ్లోర్ లు ఉంటాయి. వెదురు కర్రల డిజైన్ మాదిరిగా ఎనిమిది ఫ్లోర్లు దాటడం చాలా కష్టం. బిల్డింగ్ టాప్ లోకి వెళ్లాక.. నున్నటి నిర్మాణాలు.. కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ పెరుగుతూ పట్టుకోడానికి కూడా వీలు కానీ పరిస్థితి. టాప్ ఎడ్జ్ కి చేరుకున్నాక అందరూ ఊపిరి బిగబట్టి వీడియో చూస్తూ.. ప్రేయర్ చేయడం ప్రారంభించారు. ఎక్కుతున్న హొనోల్డ్ కు కూడా అంత టెన్షన్ ఉందో లేదో కానీ.. చూసే వాళ్ల నరాలు మాత్రం చిట్లిపోయినంత పని అయ్యిందని చెబుతున్నారు.  ఈ ఫీట్ ను నెట్ ఫ్లిక్స్ ( Netflix) లైవ్ టెలికాస్ట్ చేసింది. 

ఇప్పటికి ఎన్ని సాహసాలో..

హోనోల్డ్ కు ఇది కొత్త ఫీట్ ఏం కాదు. 2017 లో అనే 3 వేల ఫీట్ల ఎత్తున్న శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించాడు. అయితే అడవుల్లో కొండలు ఎక్కడం వేరు.. సిటీల్లో ప్రేక్షకుల అరుపుల మధ్య పెద్ద భవంతులు ఎక్కడం వేరు అని చెబుతున్నారు.  ఈ బిల్డింగ్ ఎక్కుతున్న సమయంలో 89వ ఫ్లోర్ కు వెళ్లాక.. అతడు ఇచ్చిన స్మైల్ చూసి ఆత్మవిశ్వాసానికి జై కొట్టారు. నడుముకు తగిలించుకున్న ఒక క్యాన్ లో ఉన్న పౌడర్ ను అప్పుడప్పుడు చేతులకు రాసుకుంటూ సాహస యాత్రను కొనసాగించాడు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు:

అలెక్స్ హోనాల్డ్ సాహసంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తైవాన్ అధ్యక్షుడు ఆన్ లైన్ లో అభినందనలు తెలిపారు. ఈ ఉదయం, తైవాన్‌లో మనలో చాలా మంది అలెక్స్ హోనాల్డ్ తైపీ 101ని ఎక్కటాన్ని ఎంతో ఉత్కంఠతో చూశాం. ఈ అద్భుతమైన ఘనతకు అలెక్స్‌కు నా అభినందనలు.  అతనికి మద్ధతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు - ఈ రోజు, ప్రపంచం 101 అంతస్తుల భవంతి గురించి తెలుసుకోవడమే  కాకుండా, తైవాన్ సిటీ అందాలను, స్ఫూర్తిని గురించి ప్రపంచం తెలుసుకుంది.బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ పియర్స్ మోర్గాన్  ఈ సాహసాన్ని అద్భుతం అంటూ అభివర్ణించారు, హొనాల్డ్ బలం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం నా మనసును ఆశ్చర్యపరుస్తున్నాయి అని పేర్కొన్నారు. 

తైపీ 101 భవంతి ఎక్కడం ఇదే మొదటిది కాదు:

తైపీ 101 భవంతిని అధిరోహించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు  2004లో, స్పైడర్‌మ్యాన్ అని పిలువబడే ఫ్రెంచ్ అధిరోహకుడు అలైన్ రాబర్ట్ ఎక్కాడు. బిల్డింగ్ ప్రారంభోత్సవ వేడుకల సమయంలో భద్రతా తాడును ఉపయోగించి టవర్‌ను ఎక్కాడు. కానీ హోనాల్డ్ ఆ భవనాన్ని ఎలాంటి సహాయం లేకుండా ఎక్కిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వేసిన ప్రశ్న ఏమిటంటే.. కాల్లు పట్టేయలేదా.. చేతులు జారలేదా.. కాళ్లు పట్టేసి.. పట్టు తప్పి పడిపోతే ఏంటి పరిస్థితి..? అని. కానీ గుండెనిండా కాన్ఫిడెన్స్ నింపుకున్న హోనాల్డ్ కు.. టవర్ పైన ఉన్న తన టార్గెట్ మాత్రమే కనిపించింది.. మహాభారతంలో అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్లుగా. అందుకే ఈ ఫీట్ సాధించగలిగాడు.