
US Embassy: గడచిన కొన్ని నెలలుగా అమెరికా వెళ్లాలి అనే ఆలోచన కూడా చేసేందుకు చాలా మంది సాహసించటం లేదు. పైగా వీసాల కోసం దరఖాస్తులు కూడా గతంలో కంటే చాలా వరకు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా అమెరికాలో డిపోర్టేషన్ సమస్యను భారతీయులే ఎదుర్కొంటున్నందున చాలా మంది అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే భారతదేశంలోని యూఎస్ ఎంబసీ బాంబు పేల్చింది.
తాజాగా భారతదేశంలోని యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఎంబసీ ఆఫీషియల్ ఖాతాలో దీనికి సంబంధించిన సమాచారం పంచుకుంది. వాస్తవానికి గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు ఎక్కువగా డిపోర్టేషన్ కి గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే రూల్స్ ప్రకారం గడువు తర్వాత అమెరికాలో నివసిస్తూ డిపోర్టేషన్ కి గురైన వ్యక్తులు భవిష్యత్తులో తిరిగి యూఎస్ వెళ్లకుండా పర్మనెంట్ బ్యాన్ విధిస్తామని ఎంబసీ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.
If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp
— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025
వాస్తవానికి ఎంబసీ అధికారులు ఈ ఏడాది ఇది మూడోసారి భారతీయ ప్రయాణికులను హెచ్చరిస్తూ ట్వీట్ చేయటం. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం.. ఎవరైనా విదేశీయులు అమెరికాలో 30 రోజులు గడువు ముగిసిన తర్వాత అక్కడ నివసించాలంటే ఫెడరల్ ప్రభుత్వ అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి.
ఈనెల ప్రారంభంలో యూఎస్ ఎంబసీ చేసిన ఎక్స్ పోస్టును పరిశీలిస్తే.. అమెరికా ప్రభుత్వం మోసాలు, అక్రమ వలసలను అంతం చేయడానికి అమెరికా ప్రభుత్వం సమన్వయంతో కూడిన పరస్పర చర్యలను ప్రారంభించిందని పేర్కొంది. వీసా మోసానికి పాల్పడిన వారు అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధిస్తామని ఎంబసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అక్రమ వలసలకు సహకరించే వ్యక్తులు, విదేశీ ప్రభుత్వాలకు కొత్త వీసా పరిమితి విధానాలు వర్తిస్తాయని పేర్కొంది.
The U.S. government has launched a coordinated interagency effort to combat fraud and end illegal immigration.
— U.S. Embassy India (@USAndIndia) May 15, 2025
Those found guilty of visa fraud will face permanent bans from entering the United States. New visa restriction policies apply to individuals and foreign governments… pic.twitter.com/bLwX2JStEg
అమెరికాకు జీవితంలో మరోసారి వెళ్లకుండా శాశ్వత నిషేధం విధిస్తామని యూఎస్ ఎంబసీ ఎవరిని ఉద్ధేశించి చెప్పిందనే విషయాన్ని గమనిస్తే.. వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అమెరికా వెళ్లి గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే నివసిస్తున్నట్లయితే అలాంటి భారత పౌరులు మాత్రమే ప్రభావితం అవుతారు. వివిధ వలసేతర వీసాలపై అమెరికాకు వెళ్లే ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికాలోకి ప్రవేశించే సమయంలో మంజూరు చేసిన చెల్లుబాటు వ్యవధిని ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని గుర్తుంచుకోండి. వాస్తవానికి వీసా ముగింపు గడువు తేదీ ఇమ్మిగ్రెంట్లు నివసించే కాలపరిమితి కాదని.. అమెరికాలో సదరు వ్యక్తి ఎంట్రీ సమయంలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు స్టే వ్యవధిని నిర్ణయిస్తారు.