
- భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం అతిపెద్ద విజయం
- ఇరుగు పొరుగుదేశాల మధ్య కోపం మంచిది కాదు
- సీజ్ఫైర్ కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడి
న్యూయార్క్: తమ దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై భారత్ 100 శాతం సుంకాలు తగ్గిస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరలోనే భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగనున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధించే దేశాల్లో ఇండియా కూడా ఒకటని పేర్కొన్నారు. అయితే, ఈ డీల్ కోసం తాము తొందరపడడం లేదని వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియా దేశాల పర్యటన సందర్భంగా శుక్రవారం ట్రంప్ ఫాక్స్న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికాతో డీల్కోసం ప్రపంచంలోని దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ‘‘దక్షిణ కొరియా ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నది. కానీ నేను అందరితో ఒప్పందాలు చేసుకోవడం లేదు. పరిమితిని నిర్ణయించబోతున్నా. మరికొన్ని ఒప్పందాలు చేసుకుంటా.
మాతో డీల్ చేసుకోవాలనుకునే 150 దేశాల జాబితా నా దగ్గర ఉన్నది” అని తెలిపారు. భారత్--–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించిన విషయం తెలిసిందే. ట్రేడ్డీల్పై భారత్, అమెరికా మధ్య చర్చలు నడుస్తున్నాయని, అవి సంక్లిష్ట చర్చలు అని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలని, అది జరిగేవరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుందని అన్నారు.
సీజ్ఫైర్ క్రెడిట్ తీసుకోవట్లే
భారత్, పాక్మధ్య మధ్యవర్తిత్వం నడపడం అతిపెద్ద విజయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య కోపం మంచిదికాదని అన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగకుంటే అణు యుద్ధానికి దారితీసేదని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
‘‘ఈ సీజ్ఫైర్క్రెడిట్ నేను తీసుకోవడం లేదు. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన సమస్య సద్దుమణగడానికి సాయం చేశా. ఇంకా ఎన్నేండ్లు ఈ సమస్యపై పోరాటం చేస్తారు? నేను ఏ సమస్యనైనా పరిష్కరిస్తా. వారిని కలిపి వారి సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తా” అని అన్నారు. కాగా, భారత్, పాక్మధ్య నెలకొన్న ఉద్రిక్తతను
తగ్గించేందుకు మధ్యవర్తిత్వం నడిపినట్లు ట్రంప్ చెప్పడం వారం రోజుల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం.