
Tesla Mumbai: చాలా కాలం నుంచి భారత మార్కెట్లలోకి తన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత అధికారులు ఎలాన్ మస్క్ తో కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే దిగుమతి సుంకాలను పరిగణలోకి తీసుకున్న టెస్లా భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేకపోవటం కూడా ఎంట్రీని ఆలస్యం చేసింది.
అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన నాటి నుంచి ఎలాన్ మస్క్ ప్రాజెక్టులకు ఇండియాలో వేగంగా క్లియరెన్సులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇంటర్నెట్ సేవల సంస్థ స్పేసెక్స్ కూడా వ్యాపార అనుమతులను ఇండియాలో పొందింది.
ALSO READ : శుక్రవారం షాకిచ్చిన గోల్డ్.. హైదరాబాదులో రేట్లు పైపైకి.. తులం ఎంతంటే
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యూఎస్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తన తొలి భారతీయ షోరూంను ఆర్థిక రాజధాని ముంబైలో జూలై 15న ప్రారంభించనుంది. అయితే దీనిని టెస్లా తన ఎక్స్ పీరియన్స్ సెంటర్ అని పిలుస్తోంది. ఇప్పటికే టెస్లా సంస్థ దీనికోసం అవసరమైన ఉద్యోగులను కూడా నియమించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ షోరూం నుంచి అమ్మకాలు పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతాయని సమాచారం. దీని తర్వాత రెండవ షోరూం దేశ రాజధాని ఢిల్లీలో కూడా త్వరలోనే ఓపెన్ అవ్వొచ్చని తెలుస్తోంది. టెస్లా దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని తేలింది.