
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి డిపోర్టేషన్, టారిఫ్ ల పెంపు వంటి వరుస షాకులు ఇస్తున్న ట్రంప్ తాజాగా ఇండియన్ స్టూడెంట్స్ కి మరో షాక్ ఇచ్చారు. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పరిశీలించేందుకు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు చెక్ చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో వైట్ హౌస్ కి యూనివర్సిటీలకు మధ్య నెలకొన్న వివాదాన్ని మరింత తీవ్రం అవుతుందనే చెప్పాలి. - ఇది మొదట్లో హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ వంటి ఉన్నత విశ్వవిద్యాలయాలకు ఇబ్బందిగా మారినా.. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ట్రంప్ తాజా నిర్ణయం.. అంతర్జాతీయ విద్యార్థులకు, వారిపై ఆధారపడిన యుఎస్ విశ్వవిద్యాలయాలకు "విపత్తు లాంటిదని... ఇది ఆర్థికంగా, సాంస్కృతికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు, అమెరికాలోని అనేక విద్యా సంస్థలకు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు.
ఇదిలా ఉండగా.. మంగళవారం ( మే 27 ) భారత్తో పాటు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు కీలక హెచ్చరిక చేశారు ట్రంప్. చదువుకోవడానికి అని అమెరికాకు వెళ్లి విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రిస్క్లో పడతాయని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది.
యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాపౌట్ అవడం, చదువును మధ్యలోని ముగించడం చేస్తే సదరు విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్లో యూఎస్ వీసా పొందే పరిస్థితి లేకుండా పోతుందని యూఎస్ ఎంబసీ హెచ్చరించడం గమనార్హం. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది. వీసా నిబంధనలను పాటించకపోతే అమెరికా నుంచి పంపిచేస్తామని కూడా విదేశాల నుంచి చదువుకోవడానికి యూఎస్ వెళ్లిన విద్యార్థులను ఆ దేశం హెచ్చరించింది.