మరోసారి ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ
గత వారం వీటో పవర్‌తో అడ్డుకున్న ట్రంప్
వాషింగ్టన్: కాంగ్రెస్ ఆమోదించిన 740 బిలియన్ డాలర్ల డిఫెన్స్ బిల్లుపై వీటో ప్రయోగించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ బిల్లును యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ భారీ మెజార్టీతో ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)2021 పై గత వారం ట్రంప్ వీటో ప్రయోగించారు. అమెరికా రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లుగా లేదని ట్రంప్ కామెంట్ చేశారు. రష్యా, చైనాలకు బహుమతి ఇస్తున్నట్లు తయారు చేశారని మండిపడ్డారు. ఇది దేశ భద్రతకు నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. డెమోక్రటిక్ ఆధిపత్యం ఉన్న ప్రజాప్రతినిధుల సభలో.. 109 మంది రిపబ్లికన్లు బిల్లుకు మద్దతుగా ఓటేశారు. 322-=87 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి మాట్లాడుతూ.. మన దేశం, ప్రజలను కాపాడుకునేందుకు రాజ్యాంగం కల్పించిన బాధ్యతను యూఎస్ హౌస్ సమర్థించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ను ఆమోదించింది’ అని అన్నారు. యూఎస్ హౌస్ ఆమోదించిన బిల్లును సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అక్కడ కూడా మూడింట రెండొంతుల ఓట్లు పడితేనే ట్రంప్ వీటో వీగిపోతుంది. గతంలో సెనేట్‌లో 84–=13, హౌస్‌లో 355-=78 ఓట్ల తేడాతో రక్షణ బిల్లు, 740 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. తనకు ఉన్న వీటో అధికారం ద్వారా ట్రంప్ వెనక్కి తిప్పి పంపించారు.
ఆర్థిక సాయం పెంచే బిల్లుకు ఆమోదం
కరోనా రిలీఫ్ ప్యాకేజీలో నిరుద్యోగులకు ప్రతిపాదించిన 600 డాలర్ల ఆర్థిక సాయాన్ని 2 వేల డాలర్లకు పెంచే బిల్లును అమెరికా ప్రజాప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ మేరకు ఈ బిల్లు పాసైంది. అయితే రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సెనేట్ కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేరింగ్ ఫర్ అమెరికన్స్ విత్ సప్లిమెంటరీ హెల్ప్ (క్యాష్) యాక్ట్ -2020ని యూఎస్ హౌస్ ఆమోదించింది. ‘మనది కన్జ్యూమర్ ఎకానమీ. అమెరికన్లకు నగదు సాయం చేస్తే ఎకానమీ పుంజుకుంటుంది. హాలిడే సీజన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికన్ ఫ్యామిలీలకు 2 వేల డాలర్ల సాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నా’ అని యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సోమవారం అన్నారు. 1 ట్రిలియన్ డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీపై ట్రంప్ ఆదివారం సంతకం చేశారు. ఇందులో ఆర్థిక సాయాన్ని 600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు పెంచుతూ యూఎస్ హౌస్ ఆమోదం తెలిపింది.
