ఎఫ్1 స్టూడెంట్లకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదు.. అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్టీకరణ

ఎఫ్1 స్టూడెంట్లకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదు.. అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్టీకరణ
  • ప్రజాభవన్​లో హెచ్-1బీ వీసాపై అవగాహన సెమినార్

హైదరాబాద్, వెలుగు: అమెరికాలో చదువుకోవడానికి ఎఫ్-1 వీసా పొందిన విదేశీ విద్యార్థులకు, ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)లో ఉన్న అభ్యర్థులకు హెచ్ 1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు వర్తించదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు.  శనివారం ప్రజాభవన్ లో సీఎం ప్రవాసి ప్రజావాణి నిర్వహించిన హెచ్ -1బీ ఇంటరాక్టివ్ సెషన్ లో పలువురి అనుమానాలను యూఎస్ ఇమిగ్రేషన్ నిపుణులు నివృత్తి చేశారు. 

భారతదేశంతో సహా ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికా హెచ్ 1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్ల  ఫీజు వర్తిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారికి,  ఇతర సంస్థలకు మారిన వారికి ఎలాంటి ఫీజు ఉండదని తెలిపారు. హెచ్ 4 వీసా ఉన్న దంపతులు హెచ్1బీలోకి మారెందుకు కూడా లక్ష డాలర్ల ఫీజు వర్తించదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు వివరించారు. 

హెచ్1బీ అంశంలో  ఎలాంటి సందేహాలున్నా సీఎం ప్రవాసి ప్రజావాణి ద్వారా  సంప్రదిస్తే నివృత్తి చేస్తామని స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఇంటరాక్టివ్ స్టేషన్ లో అమెరికా నుంచి జూమ్ ద్వారా వర్జీనియా స్టేట్ సెన్సస్ కమిషనర్ శ్రీధర్ నాగిరెడ్డి, అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకులు బంగారు రెడ్డి పాల్గొనగా.. ప్రజా భవన్ నుంచి అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ జాష్ డార్లింపెల్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, ఇమిగ్రేషన్ నిపుణులు హరికృష్ణ, ఆర్టిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు హాజరయ్యారు.