- యురేనియం మాకు అప్పగించాల్సిందే: ట్రంప్
- లేదా అంతర్జాతీయ సాక్షి సమక్షంలో నాశనం చేయాలి
- అబ్రహం అకార్డ్స్ లో పాక్ చేరాలని మెలిక
- దీటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరిక
- 15 ఏండ్లలో ఇజ్రాయెల్ ఉండదు: మొజ్తబా ఖమేనీ
టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలకు ప్రధాన అడ్డంకి ఇరాన్ దగ్గరున్న యురేనియం నిల్వలేనని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అణ్వాయుధ తయారీ కోసం శుద్ధి చేసిన ఈ యురేనియం నిల్వలను నాశనం చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు.
‘శుద్ధి చేసిన యురేనియం(న్యూక్లియర్ డస్ట్)ను వెంటనే అమెరికాకు అప్పగించాలి. లేదా ఇరాన్ అక్కడికక్కడే లేదా మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ లేదా దానికి సమానమైన సంస్థ సమక్షంలో ధ్వంసం చేయాలి’ అని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, శుద్ధిచేసిన యురేనియంతో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా నిరోధించడమే తన లక్ష్యమని ట్రంప్ పదేపదే చెప్పారు. కానీ, తమకు అణ్వాయుధాలు తయారుచేసే ప్రణాళికలే లేవని ఇరాన్ వాదిస్తోంది. ఏప్రిల్ 8న ప్రారంభమైన బలహీన కాల్పుల విరమణను ముప్పులోకి నెడుతూ ఇరాన్ పడవలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా దళాలు తాజాగా ఆత్మరక్షణ దాడులు నిర్వహించిన సమయంలో ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.
చర్చలు చక్కగా సాగుతున్నయ్
ఇరాన్‌తో చర్చలు చక్కగా సాగుతున్నాయని ట్రంప్ సోమవారం చెప్పారు. అయితే అవి విఫలమైతే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరించారు. ‘‘ఇది అందరికీ గొప్ప ఒప్పందంగా మాత్రమే ఉంటుంది లేదా అసలు ఒప్పందమే ఉండదు” అని ఆయన ట్రూత్ సోషల్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌లో రాశారు.
ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి జరిగే ఏ ఒప్పందంలోనైనా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే లక్ష్యంతో ట్రంప్ ఫస్ట్ టర్మ్‌లో అమెరికా మధ్యవర్తిత్వంలో ప్రవేశపెట్టిన అబ్రహం అకార్డ్స్(ఒప్పందాలు)లో సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్, తుర్కియే, జోర్డాన్ సహా పలు అదనపు దేశాలు చేరాలనే నిబంధన ఉండాలని ఆయన చెప్పారు.
శనివారం జరిగిన చర్చల సమయంలో తాను ఈ అబ్రహం ఒప్పందాల ప్రణాళికను నాయకుల వద్ద ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. కాగా, 2020లో అబ్రహం ఒప్పందాలలో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి దేశాలుగా చేరాయి. ఈజిప్ట్, జోర్డాన్, తుర్కియే ఇప్పటికే ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించగా, ఏదైనా ఒప్పందానికి మొదట పాలస్తీనా దేశ ఏర్పాటుకు స్పష్టమైన మార్గాన్ని సుగమం చేయాలని సౌదీ అరేబియా వాదిస్తోంది.
హార్మూజ్, దక్షిణ ఇరాన్లో అమెరికా దాడులు
ఇరాన్ దళాల నుంచి ఎదురవుతున్న ముప్పుల నుంచి తమ సైనికులను రక్షించడానికి అమెరికా దళాలు మంగళవారం దక్షిణ ఇరాన్‌లో ఆత్మరక్షణ దాడులు చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన దాడుల వివరాలను వెల్లడించలేదు. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్స్‌ను అమర్చడానికి ప్రయత్నిస్తున్న పడవలు ఈ లక్ష్యాలలో ఉన్నాయని మాత్రమే చెప్పారు.
అంతకుముందు ఇరాన్ లోని దక్షిణ నగరం బందర్ అబ్బాస్‌లోనూ పేలుళ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా ఎమ్‌క్యూ-9 డ్రోన్‌ను, ఒక యుద్ధ విమానాన్ని అడ్డుకున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.
ఒక ఆర్‌క్యూ-4 డ్రోన్, ఎఫ్-35 యుద్ధ విమానం ఇరాన్ గగనతలం నుంచి పారిపోయేలా చేశామని వెల్లడించింది. తమ వైమానిక రక్షణ విభాగాలు ఆ డ్రోన్‌ను కూల్చివేసి, ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన యుద్ధ విమానంపైకి కాల్పులు జరిపినట్లు తెలిపింది.
అమెరికాది నమ్మకద్రోహం: ఇరాన్
యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్న తరుణంలో, అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఖండించింది. అమెరికాది దురుద్దేశం, నమ్మకద్రోహం అని మండిపడింది. ఈ దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనే అని, అన్ని పర్యవసానాలకు అమెరికాదే బాధ్యత అని హెచ్చరించింది.
ఖతార్లో కొనసాగుతున్న చర్చలు
ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించేందుకు కుదిరే అవకాశం ఉన్న ఒప్పందంలో కీలక విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇరాన్ ప్రతినిధులు ఖతార్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్, ప్రధాన సంప్రదింపుల ప్రతినిధి మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్డోల్నాసర్ హెమ్మతి ఉన్నారు. కాగా, అమెరికాతో చర్చలు జరుగుతున్న అవగాహనా ఒప్పందం ప్రకారం విదేశాలలో స్తంభింపజేసిన దాదాపు 24 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది.
హెజ్బొల్లాను తుడిచిపెట్టేస్తాం: నెతన్యాహు
లెబనాన్‌తో పొడిగించిన కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ హెజ్బొల్లాపై తమ దాడులను తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. దక్షిణ లెబనాన్ అంతటా దాడులు కొనసాగుతున్నందున, ఇజ్రాయెల్ దళాలు వారిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయని ఆయన ప్రకటించారు.
కాగా, నెతన్యాహు ప్రకటన చేసిన కొద్ది గంటలకే, లెబనాన్‌లోని ఒక గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో12 మంది మరణించారు. సోమవారం ఆలస్యంగా బెకా వ్యాలీలోని మష్ఘరా గ్రామంపై ఈ దాడి జరిగినట్లు స్థానిక నివేదికలను ఉటంకిస్తూ ఏపీ వార్తా సంస్థ తెలిపింది.
15 ఏళ్లలో ఇజ్రాయెల్ ఉండదు: మొజ్తబా ఖమేనీ
రాబోయే 15 ఏళ్లలో ఇజ్రాయెల్ ఉండదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఉనికి త్వరలోనే ముగిసిపోతుందని ఆయన మంగళవారం ఈద్ అల్-అధా పండుగను పురస్కరించుకుని ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. ‘సమయాన్ని వెనక్కి తిప్పలేం, అస్థిరమైన జియోనిస్ట్ పాలన తన ఉనికి ముగింపునకు మరింత దగ్గరవుతుంది’ అని అన్నారు.
హజ్ యాత్ర కోసం విడుదల చేసిన సందేశంలో, మొజ్తబా ఇజ్రాయెల్‌ను అస్థిరమైన జియోనిస్ట్ పాలన అని అభివర్ణించినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. గల్ఫ్ ప్రాంతం ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు డాలుగా పనిచేయదని కూడా మొజ్తబా అన్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
