భీకర దాడులు: ఇరాన్ పై విరుచుకుపడిన అమెరికా... గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం

భీకర దాడులు: ఇరాన్ పై విరుచుకుపడిన అమెరికా... గల్ఫ్ దేశాలపై  ఇరాన్ బాంబుల వర్షం
  • ఒమన్​లో ఇండియన్స్ ఉన్న మరో షిప్​పై అమెరికా దాడి
  • వారంలో ఇది మూడో ఘటన
  • బుధవారం షిప్​పై దాడిలో ముగ్గురు ఇండియన్ సిబ్బంది మృతి  

టెహ్రాన్/వాషింగ్టన్:  అమెరికా, ఇరాన్​ మధ్య దాడులు ఆగడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌‌‌‌సెత్.. ఇరాన్‌‌‌‌పై తీవ్రంగా దాడి చేస్తామని బుధవారం హెచ్చరించిన కొద్దిసేపటికే దాడులు మొదలయ్యాయి. పశ్చిమ టెహ్రాన్, ఫార్స్ ప్రావిన్స్, బందర్ అబ్బాస్, ఖేష్మ్ ఐలాండ్, కిష్, మినాబ్, సెంట్రల్ ఇస్ఫాహన్‌‌‌‌లోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. అయితే, ఇరాన్‌‌‌‌లోని పలు లక్ష్యాలపై తాము ట్రంప్​ ఆదేశాల మేరకు ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్టు అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ (సెంట్​కామ్) ప్రకటించింది. 

అమెరికా  దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్‌‌‌‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్​బాంబుల వర్షం కురిపించింది. ‘రెండు విడతలుగా జరిగిన ఆపరేషన్లలో అలీ, అహ్మద్ అల్-జాబెర్ వైమానిక స్థావరాలలో అమెరికా సైన్యానికి చెందిన 18 కీలక లక్ష్యాలను విజయవంతంగా టచ్​చేశాము’ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్​జీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. 

అలాగే, షేక్ ఇసా వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. బహ్రెయిన్‌‌‌‌లోని అమెరికా 'ఫిఫ్త్ ఫ్లీట్' పై కూడా ఇరాన్ దాడి చేసినట్టు అంతకుముందు ఇరాన్ మీడియా నివేదించింది. అలాగే, హార్మూజ్ జలసంధికి అన్ని రకాల నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ఐఆర్‌‌‌‌జీసీ ప్రకటించింది. కానీ, హార్మూజ్ జలసంధిని మూసివేసినట్టు ఇరాన్ చేసిన ప్రకటన అవాస్తవమని అమెరికా  స్పష్టం చేసింది.  

ఒమన్‌‌లో మరో షిప్‌‌పై అమెరికా దాడి

ఒమన్ షాహిద్ పోర్ట్ వద్ద భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై గురువారం అమెరికా దాడికి పాల్పడింది. దీంతో షిప్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలిసింది. ‘ఎంటీ జల్‌‌‌‌వీర్’ అనే ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనను ఒమన్‌‌‌‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ఇరాన్‌‌‌‌కు చెందిన మెహర్ వార్తా సంస్థ ప్రకారం.. నౌకలో ఉన్న 20 మంది సిబ్బందిలో ఐదుగురిని ఆ దారిలో వెళ్తున్న ఇతర నౌకలు రక్షించి ఒమన్‌‌‌‌కు తరలించాయి.

ఈ వారంలో మూడో దాడి

ఎంటీ జల్‌‌‌‌వీర్ పై జరిగిన అటాక్​తో ఈ వారంలో ఒమన్ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న షిప్ ల​పై దాడి జరగడం ఇది మూడోసారి. బుధవారం ఒమన్ తీరంలో పలావు జెండాతో ఉన్న ‘సెటెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌‌‌‌పై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది మృతిచెందారు. ఈ విషయాన్ని షిప్పింగ్​మినిస్టర్​సర్పానంద సోనోవాల్ కూడా​కన్​ఫర్మ్​చేశారు. 

మృతులు డెక్​క్యాడెట్​ఆదిత్య శర్మ, ఇంజిన్​ఫిట్టర్​శివానంద్​చౌరాసియా, చీఫ్​ ఇంజనీర్​ పట్నాల సురేశ్​గా గుర్తించారు. వారి డెడ్​బాడీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, ఇరాన్‌‌‌‌పై విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినందుకే ఆ ట్యాంకర్‌‌‌‌పై తాము కాల్పులు జరిపినట్టు అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిని భారత్​తీవ్రంగా ఖండించింది. అలాగే, సోమవారం 24 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ మారివెక్స్’ నౌక పైనా అమెరికా దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంతో ఆ నౌక మంటల్లో చిక్కుకుంది.

దాడులు ఆపేస్తున్నాం: ట్రంప్ 

ఇరాన్‌‌పై గురువారం రాత్రికి భారీ దాడులు చేస్తామని, ఖర్గ్ ఐల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. ఆ తర్వాత కొన్ని గంటలకే దాడులు ఆపేస్తున్నట్టు చివరి నిమిషంలో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ అగ్రనేతలతో అమెరికా జరిపిన చర్చలు సఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. ‘‘ఇరాన్ నాయకులతో నేరుగా మాట్లాడాం. చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయి. 

అందుకే ఈ రాత్రికి ప్లాన్ చేసిన దాడులను నిలిపివేస్తున్నాం’’ అని ప్రకటించారు. తీవ్ర నష్టాన్ని కలిగించే సైనిక చర్యల కంటే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే ఇరు దేశాలకు శ్రేయస్కరమని ఆయన హితవు పలికారు. కానీ.. అంతకు కొన్ని గంటల ముందే ట్రంప్‌‌ ఇరాన్‌‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  

‘ఈ రాత్రి (గురువారం) ఇరాన్‌‌పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం.. ఖర్గ్ ఐల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటాం. దాని చమురు మార్కెట్‌‌పై వెనెజువెలా తరహా నియంత్రణ సాధిస్తాం’ అని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెడుతూ, వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్‌‌పై అమెరికా తన దాడులను కొనసాగిస్తుందని హెచ్చరించారు.