అమెరికాలో దీపావళికి సెలవు!

అమెరికాలో దీపావళికి సెలవు!

వాషింగ్టన్: అమెరికాలో దీపావళి రోజు సెలవు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ అమెరికన్​ చట్టసభ సభ్యురాలు గ్రేస్​ మెంగ్ యూఎస్ కాంగ్రెస్ లో శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మీడియాతో​ మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి దీపావళి అత్యంత ముఖ్యమైన రోజు.  న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. దీపావళిని ఫెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. ఆ కుటుంబాలు కలిసి వేడుకలు చేసుకునేందుకు వీలుంటుంది.

అంతేగాక, విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను చాటుతుంది" అని పేర్కొన్నారు. ఈ బిల్లు యూఎస్​ కాంగ్రెస్ లో ఆమోదం పొంది, ప్రెసిడెంట్​ సంతకం చేసిన తర్వాత దీపావళిని సెలవు దినంగా ప్రకటించేందుకు అవకాశం ఉంటుంది. అది జరిగితే, అమెరికాలో ఫెడరల్ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలుస్తుంది. ఈ బిల్లును అమెరికాలోని భారత సంతతి చట్టసభ సభ్యులు, పలు కమ్యూనిటీల నేతలు స్వాగతించారు. ఇదిలా ఉండగా.. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని 2021లోనూ యూఎస్ కాంగ్రెస్​లో బిల్లును ప్రవేశపెట్టారు. కానీ,  పలు కారణాలతో అది ఆమోదం పొందలేదు.