
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం బ్రాండెడ్ & పేటెంట్ ఔషధాల దిగుమతులపై 100 శాతం వరకు సుంకాలను(ట్యాక్స్‌లు) ప్రకటించారు. ఈ కొత్త ట్యాక్స్‌లు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే, ఆ మందుల కంపెనీ అమెరికాలోనే ఒక కొత్త తయారీ ప్లాంట్‌ను కడితే దీని నుండి మినహాయింపు ఉంటుంది అని చెప్పారు.
ముఖ్యంగా, USలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులపై ఎటువంటి సుంకాలు ఉండవు. కానీ ఒక కంపెనీ ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టినా (బ్రేకింగ్ గ్రౌండ్ లేదా నిర్మాణంలో ఉన్నా) సరే, ఆ మందులపై ట్యాక్స్ ఉండదు.
ఔషధ పరిశ్రమపై అమెరికా విధించిన సుంకాలు భారత ఫార్మా కంపెనీల ఆదాయాలపై భారీగా ప్రభావం చూపుతాయి. SBI రీసెర్చ్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 40 శాతం అమెరికా మార్కెట్‌కు వెళ్తుంది. భారత ఫార్మా ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలను విధిస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో ఔషధ కంపెనీల ఆదాయాలు 5 నుండి 10 శాతం తగ్గవచ్చు.
2024లో అమెరికా మొత్తం ఫార్మా దిగుమతుల్లో భారతదేశం వాటా ఆరు శాతం. అమెరికాలో వాడే ప్రిస్క్రిప్షన్లలో 90 శాతం జనరిక్ మందులే ఉన్నాయి, ఈ జనరిక్ మందుల సప్లయ్ లో భారతదేశ వాటా 35 శాతం.
అమెరికాలో ప్రతి వ్యక్తి ఆరోగ్య ఖర్చు సంవత్సరానికి USD 15,000, ముఖ్యంగా, ఫార్మా పరిశ్రమపై సుంకాల పెరుగుదల US పౌరుల ఆరోగ్య ఖర్చుపై కూడా గట్టి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.