ప్రతి మనిషిలో దేవుడిని చూసిన క్షణం అంటూ ట్రంప్..

ప్రతి మనిషిలో దేవుడిని చూసిన క్షణం అంటూ ట్రంప్..

ప్రతి మనిషిలోనూ దేవుడిని చూసిన క్షణం తాను స్వేచ్ఛా జీవినంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. స్వామి వివేకానంద మాటలను ప్రస్తావించారు. రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన ట్రంప్ అహ్మదాబాద్ మోతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి మాటలను ఆయన గుర్తు చేశారు. వివేకానందుడు ఏనాడో చెప్పినట్లుగా.. ‘ప్రతి మనిషి ఎదురుగా నేను నిలబడి భక్తి భావంతో అతడిలో దేవుడిని చూడగలిగినప్పుడు నేను స్వేచ్ఛా జీవిని’  అని ట్రంప్ అన్నారు. భారత్, అమెరికాలో మనం ఒక ఉన్నత ఆశయం కోసం పుట్టామని నమ్ముతామని చెప్పారాయన. పర్ఫెక్షన్‌తో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తి సామర్థ్యంతో పని చేసేలా చూడాలని భగవంతుడిని కీర్తిస్తామని అన్నారు.

రెండ్రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ అక్కడి నుంచి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత మోతెరా స్టేడియానికి చేరుకుని.. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టగానే స్టేడియంలోని జనమంతా ఒక్కసారిగా ‘నమస్తే ట్రంప్’ అంటూ స్వాగతం చెప్పారు. ‘నమస్తే.. హలో ఇండియా’ అంటూ ప్రసంగం మొదలుపెట్టారు ట్రంప్. మోడీని తనకు మంచి మిత్రుడని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నానని చెప్పారాయన. ‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది. ఇండియాను గౌరవిస్తుంది. భారత ప్రజలకు ఎల్లప్పుడూ విధేయంగా ఉంటుంది. భారతీయులకు నమ్మకమైన నేస్తం అమెరికా’ అని చెప్పారు ట్రంప్.