న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం భారీ అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఏఐ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపదలో సుమారు 3 లక్షల కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.282 లక్షల కోట్లు) తగ్గింది. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయాలు, ఏఐ డేటా సెంటర్ల విస్తరణపై కఠిన నిబంధనలు వచ్చే అవకాశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.
ఎస్ అండ్ పీ 500 సూచీ 331.94 పాయింట్లు (4.32 శాతం) పతనమై 7,353 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1,421 పాయింట్లు (5.46 శాతం) క్షీణించి 24,315 వద్ద స్థిరపడింది. డౌ జోన్స్ 1,842 పాయింట్లు (3.45 శాతం) నష్టంతో 51,513 వద్ద ముగిసింది. రస్సెల్– 2000 సూచీ 4.4 శాతం పడిపోయింది.
ఈ ఏడాది అక్టోబర్ 6న నమోదైన గరిష్ట స్థాయి నుంచి నాస్‌డాక్ 10 శాతానికి పైగా దిగజారింది. దీంతో సూచీ కరెక్షన్ దశలోకి ప్రవేశించింది. ఎస్ అండ్ పీ 500కు ఏప్రిల్ 2025 తర్వాత ఇదే అతిపెద్ద రోజువారీ పతనం. ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ సూచీ కూడా మార్చి 2020 తర్వాత అత్యధికంగా పడిపోయింది.
చిప్ కంపెనీలకు భారీ నష్టాలు
ఏఐ రంగంలో పెట్టుబడులపై ఆందోళనలు పెరగడంతో ఎన్విడియా సహా ప్రముఖ చిప్ తయారీ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ చిప్ అమ్మకాల అంచనాలను అందుకోలేకపోవడంతో క్వాల్‌కామ్ షేరు కూడా పడిపోయింది. ఐఆర్‌ఈఎన్, అప్లైడ్ డిజిటల్, కోర్‌వీవ్, నెబియస్ వంటి డేటా సెంటర్ సంస్థల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.
జీఈ వెర్నోవా, కాన్‌స్టెలేషన్ ఎనర్జీ వంటి విద్యుత్ రంగ కంపెనీలు కూడా నష్టపోయాయి. మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్, టెస్లా షేర్లు సైతం దిగజారాయి. ఫెడ్ వడ్డీ రేట్ల విధానంపై మార్కెట్ వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అధికంగా కొనసాగితే క్రమంగా వడ్డీ రేట్లు పెంచాల్సి రావచ్చని ఫెడ్ సంకేతాలు ఇచ్చారు.
డిసెంబరులో మరోసారి రేట్ల పెంపు ఉండొచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వెలువడనున్న అక్టోబర్ నెల ఉద్యోగ గణాంకాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆ వివరాలు అమెరికా ఆర్థిక పరిస్థితితో పాటు ఫెడ్ తదుపరి నిర్ణయాలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
