
తూర్పు సిరియాలో ఉన్న రెండు ఆయుధ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఆ కేంద్రాల వద్ద ఇరాన్ దళాలతో పాటు అనుబంధ గ్రూపులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ దేశ రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఈ విషయాన్ని తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఉన్న అమెరికా దళాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ దాడులకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. ఇరాన్ సాయంతో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్ గ్రూపులను కట్టుడి చేయాలన్న ఉద్దేశంతో అమెరికా వైమానిక దాడులు చేసినట్టు తెలుస్తోంది.
తమ దళాలపై దాడులు చేస్తూనే, ఇరాన్ తన జోక్యాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ దాడులు ఎక్కువైతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లాయిడ్ హెచ్చరించారు. ఇజ్రాయిల్, హమాస్‌తో సంబంధం లేకుండా ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ఇరాన్ మిలిటెంట్లు చేసిన దాడిలో సిరియాలో ఉన్న అమెరికాకు చెందిన సుమారు 21 మంది సైనికులు గాయపడ్డారు.