
న్యూఢిల్లీ: అమెరికా సుంకాల ప్రభావం ఇండియాపై మూడు లేదా ఆరు నెలలే ఉంటుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగం దీర్ఘకాల సవాళ్లపై దృష్టి పెట్టాలని అన్నారు. 2024–25 లో జీడీపీ వృద్ధి 6.5 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 9.2 శాతంగా నమోదైంది. ఇందుకు క్రెడిట్, లిక్విడిటీ సమస్యలే కారణమని నాగేశ్వరన్ పేర్కొన్నారు.
సరైన వ్యవసాయ విధానాలతో జీడీపీ 25 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ‘‘రత్నాలు, రొయ్యలు, వస్త్ర రంగాలపై సుంకాల ప్రభావాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ప్రభుత్వం యూఎస్‌తో చర్చలు జరుపుతోంది. అమెరికా–-రష్యా సమావేశం వాణిజ్య చర్చలను ప్రభావితం చేయొచ్చు.
ఏఐ, కీలక ఖనిజాలపై సప్లయ్ చెయిన్ సమస్యలను తగ్గించుకోవడం ముఖ్యం. ప్రైవేట్ రంగం దీర్ఘకాల వ్యూహాలపై ఫోకస్ పెట్టాలి”అని నాగేశ్వరన్ పేర్కొన్నారు. యూపీఐ డేటా చూస్తే వినియోగం పుంజుకుంటుందనే విషయం తెలుస్తోందన్నారు. ఇండియాలో రాబోయే కొన్నేళ్లలో 80 లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమని అన్నారు.