చదువుకోవడానికి అమెరికాకు వెళ్లారా..? ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టాడు.. స్టూడెంట్ వీసాలపై కొత్త రూల్స్ అమల్లోకి..

చదువుకోవడానికి అమెరికాకు వెళ్లారా..? ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టాడు.. స్టూడెంట్ వీసాలపై కొత్త రూల్స్ అమల్లోకి..

ఉన్నత విద్య కోసం US వెళ్లే విద్యార్థులకు ముఖ్య గమనిక. స్టూడెంట్ వీసాలపై ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగా.. కొత్తగా అప్లై చేసుకునే స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ను తక్షణమే నిలిపివేయాలని యూఎస్ ఎంబసీలకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. విదేశీ విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే లేదా కళాశాలల్లో తమ కోర్సులను మధ్యలోనే ఆపేస్తే ఆ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది.

విద్యార్థులు తమ వీసా వ్యవధి ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటూ.. ఉద్యోగాలు చేస్తుంటే వీసా రద్దు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికా భద్రతకు ముప్పు కలిగించే విధంగా కంటెంట్‌ను పోస్ట్ చేసినా స్టూడెంట్ వీసా క్యాన్సిల్ అవుతుందని అమెరికా తేల్చి చెప్పింది. ట్రాఫిక్ రూల్స్ మీరి నేరాలకు పాల్పడినా, మద్యం తాగి రోడ్లపై నానా రచ్చ చేసినా విదేశీ విద్యార్థులను అమెరికా నుంచి పంపిచేస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమెరికాలో చదువుకోవాలనుకునే మన దేశ విద్యార్థులకు.. ప్రత్యేకించి తెలుగు స్టూడెంట్స్కు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకున్న నిర్ణయాలు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వీసా రూల్స్ను కఠినతరం చేయడం, వలస చట్టాలకు ట్రంప్ పదును పెడుతుండడంతో అక్కడ చదువుకోవాలనుకునే వారికి భారంగా మారుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. వీసా వచ్చినవాళ్లు అక్కడ చదువుకుందామని అనుకున్నా.. ఆ చదువుల ఖర్చూ తడిసి  మోపెడవుతున్నది. ఇటు పార్ట్​ టైం జాబ్లు చేసుకోవడానికీ అవకాశాలు లేకుండా పోతుండడంతో అమెరికా మీద స్టూడెంట్స్ ఆశలు వదిలేసుకుంటున్నారు. ఆ దేశానికి బదులు ఇతర దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థులు గతంలో క్యాంపస్లో పార్ట్​టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా.. ఇప్పుడు అనేక రూల్స్ను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇక, బయట పార్ట్​టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసినా.. ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అమెరికన్లకు అవకాశమిచ్చాకే, వేరే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ రూల్స్ తెచ్చి పెట్టారు.