
- ఇక స్వదేశాల్లోనే నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలు
- తక్షణమే కొత్త రూల్స్ అమల్లోకి
- అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన.. బీ1, బీ2 వీసాలు ఇక ఆలస్యం
వాషింగ్టన్: వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. నాన్-ఇమిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) దరఖాస్తు విధానంలో మార్పులు చేసింది. దీని ప్రకారం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో లేదా లీగల్రెసిడెన్సీ ఉన్నచోటే వీసా ఇంటర్వ్యూలకు షెడ్యూల్ చేసుకోవాలని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో వీసా అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రదేశాల్లో ఉన్నవారికి మాత్రం దీనినుంచి మినహాయింపు ఇచ్చింది.
ఈ జాబితాలో అఫ్గానిస్తాన్, క్యూబా, చాడ్, రష్యా, ఇరాన్ ఉన్నాయి. కాగా,ఈ మార్పులతో మిగతా దేశాల పౌరులకు బీ 1 (బిజినెస్), బీ 2 (టూరిస్ట్) వీసాలు పొందడం కష్టతరంగా మారనున్నది. నాన్ ఇమిగ్రెంట్ వీసాలను బిజినెస్, టూరిస్ట్, ఎడ్యుకేషన్, టెంపరరీ జాబ్స్, యూఎస్ పౌరులను పెళ్లి చేసుకోవడం లాంటి వాటికి ఇస్తుంటారు. ఇదివరకు ఈ వీసాల కోసం అపాయింట్మెంట్లను విదేశాల్లో బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు.
ఇండియన్స్‌పై ఎఫెక్ట్
అమెరికా తీసుకొచ్చిన నాన్ ఇమిగ్రెంట్ వీసా నిబంధనలతో సింగపూర్, థాయ్‌లాండ్, జర్మనీలో ఇంటర్వ్యూ సీట్లు దరఖాస్తు చేసుకున్న భారతీయులపై నేరుగా ప్రభావం పడుతుంది. అమెరికాకు త్వరగా ప్రయాణించాల్సిన ఇండియన్స్ఇకపై విదేశాల్లో బీ1, బీ2 వీసాల అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేసుకోలేరు. ఇండియాలో హైదరాబాద్, ముంబై నగరాల్లో బీ1, బీ2 వీసాల ఇంటర్వ్యూలకు మూడున్నర నెలలు పడుతుండగా.. ఢిల్లీలో 4, కోల్‌కతాలో 5, చెన్నైలో 9 నెలల సమయం పడుతున్నది. అందుకే ఇండియన్స్ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం విదేశాలకు వెళ్తున్నారు.