
ఖాట్మండు: దేశంలో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జడ్ జెన్ యువత చేపట్టిన నిరసనలు నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యువత ఆందోళనలు కేపీ శర్మ ఓలి ప్రభుత్వ పీఠాలను కదిలిస్తున్నాయి. జెడ్ జెన్ యువత నిరసనల ఎఫెక్ట్‌తో నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ సోమవారం (సెప్టెంబర్ 8) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బాటలోనే మరో మంత్రి నడిచారు.
నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్‌ను ప్రధాని కేపీ ఓలి శర్మకు పంపించారు. యువత శాంతియుతంగా చేపట్టిన నిరసనలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును రామ్‌నాథ్ అధికారి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి నిరసన తెలిపేందుకు పౌరులకు హక్కు ఉంటుందని.. కానీ దేశ యువత శాంతియుతంగా చేపట్టిన నిరసనను ప్రభుత్వం అణచివేత, హత్యలు, బలప్రయోగంతో దేశాన్ని నిరంకుశత్వం వైపు నడిపించిందని ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిరసనకారులపై ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక అణచివేతకు జవాబుదారీతనం లేకుండా తాను అధికారంలో ఉండలేనని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాని రాజీనామా లేఖలో స్పష్టం చేశారు రామ్‌నాథ్ అధికారి. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరూ రాజీనామా చేయడంతో ఓలీ శర్మ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ప్రధాని కేపీ ఓలీ శర్మ కూడా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
నేపాల్‌లో పలు సోషల్ మీడియా యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. నేపాల్ రాజధాని ఖాట్మండులోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఖాట్మండులో జరిగిన కాల్పుల్లో 17 మంది, సన్సారి జిల్లాలో జరిగిన ఫైరింగ్‌లో ఇద్దరు నిరసనకారులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు.
దాదాపు 347 మంది గాయపడ్డారు. పొఖారా, బట్వాల్, భైరహవా, భరత్ పూర్, ఇటహరి, దమక్ ప్రాంతాలకు కూడా నిరసనలు వ్యాపించాయని తెలిపారు. ఆందోళనల సందర్భంగా పార్లమెంట్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఆందోళనకారులు పార్లమెంట్ భవనం మొదటి గేటుకు నిప్పు పెట్టారు.
యువత చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ సోమవారం (సెప్టెంబర్ 8) అత్యవసర కేబినెట్‌కి పిలుపునిచ్చారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మంత్రి మండలి సమావేశానికి ముందు హోంమంత్రి రమేశ్ లేఖక్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా, రక్షణ మంత్రి మన్ బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, ఉన్నతాధికారులతో ప్రధాని ఓలీ సమీక్ష చేపట్టారు. ఈ భేటీ తర్వాత హోంశాఖ మంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడం, ఖాట్మండు సహా ఇతర సిటీలకూ వ్యాపించడంతో పాటు 19 మంది మృతి చెందడానికి నైతిక బాధ్యత వహిస్తూ రమేశ్ లేఖక్ పదవి నుంచి తప్పుకున్నారు.