అమెరికా డబుల్ గేమ్.. భారత్‌పై దాడిలో పాక్‌కి సాయం చేసిన టర్కీకి మిస్సైల్స్..

అమెరికా డబుల్ గేమ్.. భారత్‌పై దాడిలో పాక్‌కి సాయం చేసిన టర్కీకి మిస్సైల్స్..

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధాల డీల్స్ కోసం యాత్ర మెుదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఖతార్ లో ఉన్న ఆయన అనేక అరబిక్ దేశాలకు అమెరికా రక్షణ సామాగ్రిని అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు ఆయన ప్రవర్తనను బట్టి అర్థం అవుతోంది. ఒకపక్క శాంతి అంటూనే మరోపక్క యుద్ధ సామాగ్రిని చాలా దేశాలకు అంటగట్టే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు.

తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాపై దాడి చేసిన పాకిస్థాన్ కి మద్ధతుగా నిలిచిన టర్కీతో డిఫెన్స్ డీల్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 304 మిలియన్ డాలర్లు విలువైన క్షిపణులను విక్రయించేందుకు ఆమోదం తెలిపారు. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ.2వేల 300 కోట్ల వరకు ఉండొచ్చు. డీల్ కింద 53 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, 60 బ్లాక్ 2 మిసైల్స్ అందించనున్నట్లు వెల్లడైంది. 

Also Read : రెండు దేశాలకూ బెనిఫిట్ఉండాలి

భారత్-పాక్ మధ్య దాడులు కొనసాగుతున్న సమయంలో టర్కీ ఏకంగా 350 వరకు డ్రోన్లను దాయాది పాకిస్థాన్ కి అందించింది. ఈ విషయం బయటకొచ్చినప్పటి నుంచి టర్కీ-ఇండియా మధ్య సంబంధాలు క్షీణించటం ప్రారంభమైంది. మెున్న పాకిస్థానుకు ఐఎంఎఫ్ లోన్ మంజూరు, ప్రస్తుతం టర్కీకి మిసైల్స్ సరఫరాలు చూస్తుంటే అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం టర్కీతో కుదుర్చుకున్న డీల్ అమలులోకి రావాలంటే యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరిగా తెలుస్తోంది.

ఇదే క్రమంలో టర్కీ అమెరికా నుంచి జే35 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసే ఉద్ధేశంలో ఉందని సమాచారం. వాస్తవానికి గతంలో టర్కీ రష్యా నుంచి ఎస్ 400 ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టం కొనుగోలు చేసిన తర్వాత అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్ వాటిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే టర్కిష్ వేర్పాటువాద గ్రూప్ PKKతో సంబంధాలు కలిగి ఉన్న అమెరికా మద్దతుగల కుర్దిష్ దళాలను కొత్త సిరియన్ సైన్యంలో అనుసంధానించడానికి టర్కీ-అమెరికా చర్చలు జరుపుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో PKK తన ఆయుధాలను వదిలేస్తున్నట్లు ప్రకటించటంతో స్వయంప్రతిపత్తి కోసం 40 ఏళ్లుగా జరుపుతున్న పోరాటం అంతమౌతోంది. ఈ క్రమంలో అమెరికాతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ప్రస్తుతం టర్కీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు పరిణామాలు చెబుతున్నాయి.