
- తమను కాదని హెచ్ 1బీ వీసా హోల్డర్లను తీసుకుంటున్నారని ఫిర్యాదు
- కంపెనీ తీరుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన
వాషింగ్టన్: ప్రముఖ బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లాపై అమెరికా నిరుద్యోగులు.. శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. లేబర్ ఖర్చును తగ్గించుకునేందుకు తమను కాదని హెచ్ 1బీ వీసా హోల్డర్లను ఆ కంపెనీ నియమించుకుంటోందని, దీంతో అమెరికా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు.
ఫెడరల్ సివిల్ హక్కుల చట్టాలను టెస్లా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తీసుకోకుండా హెచ్ 1బీ వీసా హోల్డర్లతో ఉద్యోగాలను టెస్లా భర్తీ చేస్తోందన్నారు. దీంతో వీసాపై ఆధారపడిన ఉద్యోగులకు టెస్లా తక్కువ జీతాలు ఇస్తోందని ఫిర్యాదు చేశారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్కాట్ టౌబ్, మానవ వనరుల స్పెషలిస్ట్ సోఫియా బ్రాండర్.. ఈ దావా వేశారు. ‘‘మేము అమెరికా పౌరులమని, అంతేకాకుండా మాకు ఎంప్లాయ్ మెంట్ స్పాన్సర్ షిప్ అవసరం లేదని భావించి టెస్లా కంపెనీ మమ్మల్ని తీసుకోవడానికి నిరాకరించింది” అని ఆ ఇద్దరూ ఫిర్యాదు చేశారు.
ఒక పోస్టు హెచ్ 1బీ వారికే అని చెప్పి ఆ పోస్టుకు అప్లై చేయకుండా టెస్లా తనను తీవ్రంగా నిరాశపర్చిందని టౌబ్ ఆరోపించారు. సెకండ్ రోల్ పోస్టుకు కూడా తనను ఇంటర్వ్యూ చేయలేదని ఆయన తెలిపారు. కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్నా కూడా రెండు పొసిషన్లకు తనను నిరాకరించారని సోఫియా బ్రాండర్ వాపోయారు. గతంలో తాను టెస్లాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేశానని ఆమె చెప్పారు.
వేతనాల దొంగతనం జరుగుతోంది
వాస్తవానికి అమెరికాలో నివాసం ఉంటున్న హెచ్ 1బీ వీసా హోల్డర్ల సంఖ్య చాలా తక్కువ అని, అయినా కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా వారికే టెస్లా కంపెనీ ప్రాధాన్యం ఇస్తోందని స్కాట్ టౌబ్, సోఫియా బ్రాండర్ ఆరోపించారు.
‘‘హెచ్ 1బీ వీసా హోల్డర్లకు తక్కువ జీతాలు ఇచ్చినా పనిచేస్తారు. దీంతో టెస్లా కంపెనీ వారికే ఉద్యోగాలు ఇచ్చి వేతనాల చోరీకి పాల్పడుతోంది. నిరుడు 1,355 వీసా వర్కర్లను తీసుకుంది. అదే సమయంలో 6 వేలకు పైగా అమెరికా ఉద్యోగులను తొలగించింది” అని ఆ ఇద్దరూ మండిపడ్డారు.