ఇక జోరుగా అమెరికా వీసా ప్రాసెసింగ్

ఇక జోరుగా అమెరికా వీసా ప్రాసెసింగ్

వాషింగ్టన్ : అమెరికా వీసా ప్రాసెసింగ్ అనుకున్న దానికన్నా శరవేగంగా జరుగుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కరోనాకు ముందున్న పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇండియా వంటి దేశాల వీసా అప్లికేషన్ల బ్యాక్ లాగ్​లను త్వరగా ప్రాసెస్ చేస్తున్నామని ఆ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా వీసా ఇంటర్వ్యూ వెయిటింగ్ టైమ్ ను తగ్గిస్తున్నాం. అలాగే ఈ పని కోసం యూఎస్ ఫారెన్ సర్వీస్ సిబ్బంది నియామకా న్ని డబుల్ చేసినం.

అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే వారు మా దేశ చట్టాల ప్రకారం ఇంటర్వ్యూకు వ్యక్తిగతంగా హాజరు కావాలి. అయితే కరోనా ఆంక్షల కారణంగా అప్లికేంట్ల సంఖ్య తగ్గింది. దీంతో ప్రాసెస్ చేయాల్సిన అప్లికేషన్ల సంఖ్య కూడా పడిపోయింది. ఇప్పుడు చాలా దేశాలు ఆంక్షలను ఎత్తేశాయి. ప్రస్తుతం మా ఎంబసీలు, కాన్సులేట్లు 96% రొటీన్ వీసా సర్వీసులు అందించగలవు” అని యూఎస్ విదేశాంగ శాఖ వివరించింది.