ఇండియన్లు గొప్ప సైంటిస్టులు: ట్రంప్

ఇండియన్లు గొప్ప సైంటిస్టులు: ట్రంప్
  • కరోనాపై పోరులో వారి సేవలు మరువలేనివని కితాబు
  • ఇండియాకు వెంటిలేటర్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటన

వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న ఇండియన్లపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. కరోనాకు వ్యాక్సీన్ ను డెవలప్ చేయడానికి అమెరికా ఇండియన్లతో కలిసి పనిచేస్తోందని అన్నారు.  వ్యాక్సీన్ తయారు చేసేందుకు సహకరిస్తున్న ఇండియన్– అమెరికన్లను గొప్ప సైంటిస్టులు, అద్భుతమైన పరిశోధకులుగా అభివర్ణించారు. శనివారం వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కరోనా సంక్షోభంలో సహకరిస్తున్న డాక్టర్లు, సైంటిస్టుల సేవలు మరువలేనివని మెచ్చుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సీన్ లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్​” అనే ప్రాజెక్ట్ కింద ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించడానికి మాజీ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

‘‘అమెరికాలో చాలామంది ఇండియన్లు ఉంటున్నారు. అందులో ఎంతో మంది గొప్ప సైంటిస్టులు, పరిశోధకులున్నారు. వ్యాక్సీన్ తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. మోడీతో మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. ఇలాంటి సంక్షోభంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి”అని ట్రంప్ అన్నారు.

వెంటిలేటర్లు అందజేస్తాం
కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో తమ దేశం ఇండియాకు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు. ‘‘ఇలాంటి కష్ట సమయంలో ఇండియాతో, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉన్నాం”అని ట్వీట్ లో పేర్కొన్నారు.