
వాషింగ్టన్: అమెరికా సుంకాల ఒత్తిడిని భారత్ తట్టుకోలేదని.. రాబోయే రెండు నెలల్లోనే ఇండియా అమెరికాకు క్షమాపణ చెబుతుందంటూ బీరాలు పలికిన యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్వరం మార్చారు. అమెరికా, భారత వాణిజ్య ఒప్పందంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపివేసిన వెంటనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ముందుకు సాగవచ్చని అన్నారు. ఇండియా రష్యా చమురు దిగుమతులను ముగించడంపై ట్రేడ్ డీల్ పురోగతి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా తైవాన్‌తో పెద్ద ఒప్పందం కుదుర్చుకుందని.. అదే విధంగా స్విట్జర్లాండ్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం ఉందని లుట్నిక్ పేర్కొన్నారు.
గత కొంత కాలంగా ఇండియాతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఘర్షణ వైఖరి కొనసాగిస్తున్నారు. మిత్ర దేశం అంటూనే ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్నారు. ప్రతీకార సుంకాలు అని 25 శాతం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించాడు. మొత్తం భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించాడు. ట్రంప్ తీరుతో ఇండియా, అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది. ఏమైందో తెలియదు గానీ ఉన్నట్టుండి స్వరం మార్చారు ట్రంప్.
►ALSO READ | ట్రంప్ సంచలన నిర్ణయం: హత్యకు గురైన చార్లీ కిర్క్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం
మళ్లీ భారత్‌పై ప్రేమ ఒలకబోస్తున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రియమైన మిత్రుడు అంటూ మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం మొదలుపెట్టాడు. రాబోయే రోజుల్లో మిత్రుడు మోడీతో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నానని, వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయన్నాడు. అలాగే అమెరికా, భారత దేశాల వాణిజ్య ఒప్పందంలో విజయవంతమైన ముగింపు లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్ పట్ల సానూకూలంగా మాట్లాడిన వెంటనే యూఎస్ వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ కూడా ఇండియాపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడటం గమనార్హం.