13 లక్షలు ఖర్చు పెట్టి ఇంటి కింద బంకర్‌‌ ఏర్పాటు

13 లక్షలు ఖర్చు పెట్టి ఇంటి కింద బంకర్‌‌ ఏర్పాటు

ప్రపంచంలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రపంచయుద్ధం తప్పదేమో అన్న డౌట్ రావడం కామన్.  అయితే ఈ విషయాన్ని మరీ సీరియస్‌‌గా తీసుకుంది అమెరికాకు చెందిన రోవన్ మెకంజీ. ఎందుకైనా మంచిదని ఏకంగా ఒక బంకర్ కట్టుకుంది. యూఎస్‌‌లో హౌజ్‌‌ వైఫ్‌‌గా ఉంటున్న 38 ఏళ్ల రోవన్.. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకనుకుందో ఏమో ఏకంగా 13 లక్షలు ఖర్చు పెట్టి తన ఇంటి కింద ఒక బంకర్‌‌ ఏర్పాటుచేసుకుంది. ఎందుకని అడిగితే “ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తుంటే ప్రపంచం అంతమయ్యే రోజుఎంతో దూరంలో లేదనిపిస్తోంది” అని చెప్పింది.

రోవన్ ఉంటున్న ఇంటి బేస్‌‌మెంట్ కింద ఒక బంకర్‌‌‌‌ను కట్టుకుంది. ఆమె కట్టుకున్న బంకర్ వీడియోను టిక్‌‌టాక్‌‌లో పోస్ట్ చేసింది. అందులో ఆమె దాచిపెట్టుకున్న ఫుడ్ ఐటెమ్స్, కొన్ని ఆయుధాలు,  నీళ్లు, నూనె డబ్బాలు, మెడిసిన్స్.. ఇలా  తన ఫ్యామిలీలో ఉన్న ముగ్గురికీ మూడేండ్ల పాటు సరిపోయేలా చాలా వస్తువులు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆమె దాచిన బీన్స్, బియ్యంతో సుమారు పాతికేళ్లు బతకొచ్చని చెప్తోంది. అంతేకాదు ఈ బంకర్ న్యూక్లియర్ రేడియేషన్‌‌ను కూడా తట్టుకుంటుందట. 

“ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులపై నాకు నమ్మకం లేదు. దేశాలన్నీ కొట్టుకునే రోజు ఎప్పుడైనా రావొచ్చు. అప్పుడు తినడానికి ఏమీ దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత దాచుకుని సర్వైవల్‌‌కు ప్రిపేర్ కావాలి” అని రోవన్ టిక్‌‌టాక్‌‌లో పోస్ట్ చేసింది. రోవన్ పోస్ట్ చేసిన బంకర్ వీడియోకి కొద్ది సేపట్లోనే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసి ‘ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంద’ని కొందరు, ‘బంకర్ల అవసరం ఏమీ రాద’ని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.