ముక్కుకెల్లి శాంపిల్‌‌ తీస్తే బ్రెయిన్‌‌కు బొర్రెవడ్డది!

ముక్కుకెల్లి శాంపిల్‌‌ తీస్తే బ్రెయిన్‌‌కు బొర్రెవడ్డది!
  • అమెరికాలో ఓ మహిళకు ముక్కు నుంచి బ్రెయిన్ ఫ్లూయిడ్స్ లీక్

న్యూయార్క్: అమెరికాలో ఓ మహిళకు కరోనా సోకిందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు నాసల్ స్వాబ్ టెస్ట్ చేస్తే.. ఏకంగా మెదడుకు బొర్రెవడింది. ఆమెకు టెస్ట్ చేసిన వ్యక్తి.. స్వాబ్ ను మరీ లోపలికి పంపడంతో ముక్కు వెనక భాగం, మెదడుకు మధ్య ఉండే బ్రెయిన్ లైనింగ్ కు రంధ్రం పడింది. దీంతో ముక్కు నుంచి బ్రెయిన్ ఫ్లూయిడ్ లీక్ అవడం స్టార్ట్ అయింది. వెంటనే గుర్తించి, ట్రీట్ మెంట్ చేయకపోతే.. ముక్కు ద్వారా బ్రెయిన్ కు గాలి, బ్యాక్టీరియా వంటివి ప్రవేశించి, ప్రాణాల మీదికి వచ్చేదని డాక్టర్లు వెల్లడించారు. 40 ఏళ్ల వయసున్న ఆ మహిళ కేస్ స్టడీ వివరాలు గురువారం అమెరికాకు చెందిన ‘‘ఓటోలరింగాలజీ–హెడ్ అండ్ నెక్ సర్జరీ” అనే జర్నల్ లో పబ్లిష్​ అయ్యాయి. అయితే అందరికీ ఇలాగే జరిగేందుకు చాన్స్ లేదని, ఆ మహిళ పుర్రెకు గతంలో సర్జరీ జరగడం వల్లే స్వాబ్ టెస్ట్ వల్ల మళ్లీ బొర్రె పడిందని స్టడీ ఆథర్, యూనివర్సిటీ ఆఫ్​అయోవా హాస్పిటల్ డాక్టర్ జారెట్ వాల్ష్​వెల్లడించారు.

ఏం జరిగిందంటే..

ఆ మహిళకు కొన్నేళ్ల కిందట తలలో బ్రెయిన్ ను కాపాడుతూ, దానికి పోషకాలు అందేలా చూసే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువవడంతో ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ సమస్య వచ్చింది. దీంతో డాక్టర్లు ఆమె ముక్కు వెనక భాగంలో బ్రెయిన్ లైనింగ్ కు రంధ్రం చేసి, ఫ్లూయిడ్స్ ను తగ్గించారు. ఆ తర్వాత రంధ్రం పూడుకుపోయేలా చేసినా.. అక్కడ బ్రెయిన్ లైనింగ్ ముక్కులోకి చొచ్చుకువచ్చింది. దీనిని సర్జరీతో సరిచేసేందుకు జులైలో డాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కరోనా టెస్టు చేయించుకోమని చెప్పారు. దీంతో స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్ తీసిన వ్యక్తి.. స్వాబ్ ను బాగా లోపలికి పంపడంతో బ్రెయిన్ లైనింగ్ కు బొర్రెవడి, ఫ్లూయిడ్ కారడం మొదలైంది. వెంటనే వాంతులు, తలనొప్పి, మెడ స్టిఫ్ గా అయిపోవడం, వెలుతురును తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు రావడంతో ఆమెను డాక్టర్ వాల్ష్​టీం ట్రీట్ మెంట్ చేసి కాపాడింది.

స్వాబ్ టెస్టులు ఇలా చేయాలి..

స్వాబ్ టెస్టులు చేసేటప్పుడు ప్రధానంగా ముక్కు నుంచి శాంపిల్స్ తీసుకునేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలని జారెట్ వాల్ష్​సూచించారు. మరీ పైకి, లోపలికి స్వాబ్ ను పంపరాదని చెప్పారు. గతంలో సైనస్ లేదా స్కల్ బేస్డ్ సర్జరీలు ఏమైనా జరిగి ఉంటే.. అలాంటోళ్లకు వీలైనంత వరకూ గొంతులో నుంచే శాంపిల్స్ తీసుకోవాలన్నారు. నాసల్ స్వాబ్ లు అయితే.. ముక్కులో కిందివైపును తాకిస్తూనే స్వాబ్ ను లోపలికి పంపాలని, అప్పుడు బ్రెయిన్ లైనింగ్ కు అది తాకే ప్రమాదం తప్పుతుందన్నారు.