
ముంబై: అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఏలిన స్ప్రింట్ లెజెండ్, జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ ఇండియాలో పర్యటించనున్నాడు. ట్రాక్‌పై తన వేగంతో పెను సంచలనాలు సృష్టించిన బోల్ట్ ఇప్పుడు తన స్ప్రింటింగ్ స్పైక్స్‌ను పక్కనపెట్టి ఫుట్‌బాల్ బూట్లు ధరించనున్నాడు. అక్టోబర్ 1న ముంబైలో జరగనున్న ఓ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బోల్ట్ పాల్గొనబోతున్నాడు.
ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలు నెగ్గిన ఉసేన్ ఈ మ్యాచ్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు, బాలీవుడ్ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కలిసి మైదానంలో సందడి చేయనున్నాడు. ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ బ్రాండ్ పూమా ఇండియా నిర్వహించనుంది. ఇందులో భాగంగా బోల్ట్.. ఐఎస్‌ఎల్ టీమ్స్ బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ జట్ల తరఫున ఆడనున్నాడు.