ఓయూలో వాకింగ్​కు యూజర్ చార్జీలు

V6 Velugu Posted on Nov 25, 2021

  • ఓయూలో వాకింగ్​కు యూజర్ చార్జీలు
  • వచ్చే నెల 1 నుంచి అమలు చేయనున్న వర్సిటీ అధికారులు
  • వాకర్స్​కు నెలకు రూ.200, స్పోర్ట్స్​కు  రూ.500 వసూలు
  • ఎంప్లాయీస్, ఫ్యాకల్టీ​ వెహికల్స్​కు స్టిక్కర్లు జారీ

ఓయూ, వెలుగు: నిధుల కోసం ఉస్మానియా వర్సిటీ అధికారులు కొత్త ఆదాయ మార్గాలకు తెరతీస్తున్నారు. ఓయూలో సినిమా షూటింగులకు పర్మిషన్ ఇస్తామని 2 నెలల క్రితం విద్యార్థి సంఘాల సమావేశంలో ప్రకటించిన అధికారులు తాజాగా వర్సిటీకి వచ్చే వాకర్స్, స్పోర్ట్స్ ఆడే బయటి వ్యక్తులు, జిమ్​కు వచ్చే వారికి వచ్చే నెల 1 నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ బుధవారం యూజర్ చార్జీలతో ఉన్న రేటు కార్డును రిలీజ్ చేసింది.  అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై స్టూడెంట్లు, ఫ్యాకల్టీ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు వర్సిటీని క్లోజ్డ్ ​క్యాంపస్​గా మార్చాలని నిర్ణయించిన అధికారులు ప్రైవేటు వ్యక్తుల వెహికల్స్​ను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే  ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఫ్యాకల్టీకి పర్మిషన్ పాస్​ల రూపంలో వెహికల్ స్టిక్లర్లను  జారీ చేస్తున్నారు.

ఫీజు కట్టిన వారికి గుర్తింపు కార్డులు
డిసెంబర్ 1 నుంచి ఓయూలో వాకింగ్​కు వచ్చే వారు నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా యూజర్ చార్జీలు కట్టిన వారికి ఓయూ అధికారులు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులను చూపించి వాకర్స్ డైలీ ఉదయం  6 నుంచి8 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వాకింగ్​చేసుకోవడానికి అనుమతిస్తారు. క్యాంపస్​లోని గ్రౌండ్​లో బాస్కెట్ బాల్, ఫుట్ బాల్​తో పాటు ఇతర ఆటలు ఆడేవారు నెలకు రూ.500 చెల్లించి గుర్తింపు కార్డు పొందాల్సి ఉంటుంది. వీరిని కూడా ఉదయం, సాయంత్రం వేళల్లోనే గ్రౌండ్ లోకి అనుమతిస్తారు. ఓయూలోని జిమ్​కి వచ్చే వారు నెలకు రూ.వెయ్యి , 3 నెలలకు రూ.2,500 కట్టాల్సి ఉంటుంది.  రూ.10 వేలు చెల్లిస్తే ఏడాది పాటు మెంబర్​షిప్​ ఇవ్వనున్నారు. ఓయూలో వాకింగ్ వచ్చే వారిలో 80 శాతం వర్సిటీకి చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్, పనిచేస్తున్న వారు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్​లు, లీడర్లు ఉన్నారు. దీంతో వీరి నుంచి సైతం యూజర్ చార్జీలు వసూలు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూజర్ చార్జీల నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్సిటీ  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టైమ్​లో కూడా ఇలాంటి నిర్ణయాలను ఎప్పుడు తీసుకోలేదని సీనియర్ అధ్యాపకులు చెప్తున్నారు. వాకర్స్ వసూలు చేసిన డబ్బులతో వర్సీటీలో గ్రీనరీని ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్తున్నారు.  

ఆర్ట్స్ కాలేజీ ఎదుట విజిటర్స్ కు అనుమతి నిషేధం!  
ఓయూలోకి బయటికి వ్యక్తుల ప్రవేశాన్ని తగ్గించేందుకు ఇప్పటికే బస్సులు, ఇతర భారీ వెహికల్స్ రావడాన్ని అధికారులు నిషేధించారు.  వర్సిటీ ఎన్విరాన్ మెంట్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తుల వెహికల్స్ ను కూడా నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓయూలో పనిచేసే వారి వెహికల్స్​కు పాస్​ల రూపంలో స్టిక్కర్లను ఇస్తునారు. రాబోయే రోజుల్లో గుర్తింపు కార్డులున్నవారిని, వర్సిటీ జారీ చేసిన స్టిక్కర్లు ఉన్న వెహికల్స్​నే లోపలికి అనుమతించనున్నారు. ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి డైలీ ఎంతో మంది విజిటర్స్ వస్తుంటారు. సాయంత్రం వేళ్లల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు పిల్లలతో కలిసి ఆర్ట్స్ కాలేజీ ఎదుట టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అయితే విజిటర్స్​కు ఈ ఫెసిలిటీ దూరం కానుంది. ఇటీవల ఆర్ట్స్ కాలేజీని సందర్శించిన హయ్యర్ ఎడ్యుకేషన్​కు చెందిన ఉన్నతాధికారి అక్కడి జనాన్ని చూసి విస్తుపోయినట్లు సమాచారం.  వర్సిటీ క్యాంపస్​లోకి ఇతరులను అనుమతించడం వల్ల అక్కడి ఎన్విరాన్ మెంట్ దెబ్బతింటుందని, దీన్ని నిషేధించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు తొందరలోనే ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి విజిటర్స్ రాకుండా చర్యలు చేపట్టనున్నారు.  

Tagged Hyderabad, ou, Walking, Osmani university, Arts college

Latest Videos

Subscribe Now

More News