ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్

ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్
  • అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్

సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో ఇబ్బందులుపడుతున్న అధికారులు బియ్యం ఇస్తారా ? లేదా ?  అని హెచ్చరించినా  ప్రయోజనం లేకపోయింది. దీంతో అధికారులు ఇవాళ సోదాలు చేసేందుకు రైస్ మిల్లుకు వెళ్లగా విషయం పసిగట్టిన రైస్ మిల్ యాజమాని మిల్లుకు తాళం వేసి పరారయ్యారు. కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో జరిగిందీ ఘటన. 

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన  రూ.35 కోట్ల విలువైన సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టినట్లు నిర్ధారించుకున్న అధికారులు ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైస్ మిల్, బియ్యం వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు రబీ, ఖరీఫ్ సీజన్లలోని ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కింద కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ఉషశ్విని రైస్ ఇండస్ట్రీస్ కంపెనీకి కేటాయించారు. తమకు  కేటాయించిన ధాన్యాన్ని దశల వారీగా ప్రభుత్వానికి  అందించాల్సిన ఉషశ్విని రైస్ ఇండస్ట్రీ కంపెనీ సకాలంలో సరఫరా చేయలేదు. మొహం చాటేయడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఇవాళ సోదాలు చేసేందుకు వెళ్లారు. 

ఇది ముందుగానే తెలుసుకున్న యజమాని  మిల్లు తాళాలు వేసి ఉడాయించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పౌర సరఫరా శాఖ అధికారులు.. రైస్ మిల్లుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను జప్తు చేస్తామని పౌరసరఫరా శాఖ అధికారులు చెబుతున్నారు.