మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీపై ఉత్తమ్ కుమార్​రెడ్డి​ఆగ్రహం

మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీపై ఉత్తమ్ కుమార్​రెడ్డి​ఆగ్రహం

హుజూర్ నగర్, వెలుగు: రాష్ట్రంలో  టీఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ అధికారులు సిండికేట్ గా ఏర్పడి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని క్యాంపు ఆఫీసులో వైఎస్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తవుతున్న, సూర్యాపేట కలెక్టరేట్ మాత్రం ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, అధికారులు కలిసి కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తి చేయకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం రూ. కోటి వరకు ఎమ్మెల్యే సైదిరెడ్డి అద్దె వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

5 సంవత్సరాలు చెల్లించిన అద్దెతో కలెక్టరేట్ భవనం పూర్తయ్యేదని చెప్పారు. అద్దె డబ్బులలో ఎవరి వాటా ఎంతో చెప్పాలని డిమాండ్​చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఆ వెంచర్లకు సంబంధించి మున్సిపాలిటీకి ల్యాండ్​ఇవ్వకున్నా కొందరు అధికారులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూర్ నగర్, నేరేడుచెర్ల మున్సిపాలిటీ లలో సమీకృత మార్కెట్ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.