వైన్ షాపులు తెరవడం లాక్ డౌన్ సిద్ధాంతానికి వ్యతిరేకమని చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్‌లో అన్ని దుకాణాలు, మాల్స్, సినిమా హాల్స్ మూసివేసి వైన్ షాపులు మాత్రమే తెరవాలని పాలసీతో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని అన్నారు. ప్రజల వద్ద అంతే ఇంతో మిగిలిన డబ్బు ఈ వైన్ షాపుల ద్వారా ఖర్చు అవుతుందని అన్నారు. లిక్కర్ ద్వారా మహిళలపై గృహ హింస పెరుగుతుందని, లిక్కర్ తాగిన వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించరని అన్నారు. లాక్ డౌన్ సమయం లో వైన్ షాపులు మూసి వేస్తే సమాజానికి మంచిదని అన్నారు.
పోతిరెడ్డిపాడు పై ఉత్తమ్ కామెంట్స్:
శ్రీశైలం నుంచి 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడుకు తరలిస్తే తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు ఉత్తమ్ .దీన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ దీక్ష చేసిందని, కృష్ణ నది యాజమాన్యం బోర్డ్ ను కలిశామని చెప్పారు. కేంద్ర జలవనరుల మంత్రి ఫోన్ చేసిన మాట్లాడామన్నారు.
ఎన్నికల తరువాత జగన్, కేసీఆర్ రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా క్లోజ్ అయ్యారని, గత ఏడాది జనవరి 12, జూన్ 28న, ఆగస్ట్ 1న ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సార్లు కలిసి అలాయ్ బలాయ్ చేసుకున్నారని అన్నారు. అలాయ్ బలాయ్ చేసుకున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు పై ఇప్పుడు ఎందుకు మాట్లాడ్డం లేదు.? అని ప్రశ్నించారు. అదనపు నీళ్ళు తీసుకపోవద్దని కేసీఆర్ జగన్ కు ఎందుకు చెప్పడం లేదని అన్నారు.
2014 లో ప్రధాన నినాదమే నీళ్లు అని, ప్రజల సెంటిమెంట్లు మీదనే గెలిచి, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం సీఎం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారన్న ఉత్తమ్ .. మరి శ్రీశైలం నుంచి ప్రతిరోజు మూడు టీఎంసీల నీటిని అదనంగా తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు అడ్డుకోవడం లేదని అన్నారు.
కేసిఆర్ అసమర్ధతతో వ్యవహరిస్తున్నారా…లేక ఏపి సీఎం జగన్ తో కుమ్మక్కయ్యారా..? అన్న అనుమానం కలుగుతుందన్నారు ఉత్తమ్. లాక్ డౌన్ లో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు. మహారాష్ట్ర చెప్పింది విని ..తుమ్మడిహెట్టిని కాదని..కాళేశ్వరం కట్టారు.. తుమ్మడిహెట్టి ద్వారా కమీషన్లు రావని తెలిసే ఆ ప్రాజెక్టును కాదనుకున్నారన్నారు.
