హైదరాబాద్, నేరేడుచర్ల, వెలుగు:
‘‘తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మిషన్ భగీరథలో దోచుకున్న డబ్బునంతా ఎన్నికల్లో పంచి గెలిచారు. కౌంటింగ్ తర్వాత కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ఫామ్ హౌజ్‌లో కూర్చొని ఒక లిస్టు తయారు చేసుకుని పేర్లు ప్రకటిస్తే సరిపోయేది’’ అని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎంపీ కేవీపీ రామచంద్రారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్‌లతో కలిసి ఉత్తమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో కూడా మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల తీరును పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని, రాష్ట్రపతికి, సీజేఐకీ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి తాము ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదన్నారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ చెప్పారట..
‘‘నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ కూటమికి 8 సీట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కి 7 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎక్స్‌అఫీషియో సభ్యునిగా రాజ్యసభ ఎంపీ కేవీపీ వస్తే ఓటు వేయకుండా ఆయన్ను అడ్డుకున్నారు. ఇంతకన్నా అన్యాయం ఇంకేం ఉంటది. ఆయన తెలంగాణ సభ్యుడే అని పార్లమెంట్ గెజిట్‌లో స్పష్టంగా ఉంది” అని ఉత్తమ్ వివరించారు. కానీ ఎంపీ కేశవరావు ఏపీ కోటాలో ఉన్నారన్నారు. 80 ఏళ్ల ఒక సీనియర్ నాయకుడు మాట్లాడే తీరు ఇదేనా అని కేకేపై మండిపడ్డారు. ఆయనకైనా సిగ్గుండాలి లేదా మాకైనా సిగ్గుండాలని అన్నారు. నేరేడుచర్ల వ్యవహారంపై ఈసీ, మున్సిపల్ సెక్రటరీలను కలిసి ఇదెక్కడి అన్యాయమని అడిగితే ‘కేటీఆర్ చెప్పారు’ అని అంటున్నారన్నారు. అధికారులకు కేటీఆర్ ప్రతి గంటకు ఫోన్ చేసి పేర్లు మార్చారని, అందుకే కేవీపీ పేరు తొలగించారని ఆరోపించారు. ‘‘చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ మొదలై ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలోని పేపర్స్ చింపి, మైక్ విరగ్గొట్టి ఎన్నిక వాయిదా వేయించారన్నారు. తర్వాత ఓటర్ లిస్టులో కొత్త పేరు నమోదు చేయించారన్నారు. సోమవారం లిస్ట్‌లో లేని సుభాష్‌రెడ్డి పేరును మంగళవారం ఎలా నమోదు చేశారని
ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా ఇలా జరగలే..
దేశంలో ఈ తీరులో మున్సిపల్ ఎన్నికలు ఎక్కడా జరగలేదని ఉత్తమ్ అన్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోమని తమ పార్టీ క్యాండిడేట్లను బెదిరించారని చెప్పారు. ప్రజలంతా తమ వైపే ఉన్నారని, కానీ అధికారులు అక్రమ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం భ్రష్టు పట్టిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు బాగా లేదని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేరేడుచర్ల ఎన్నికపై న్యాయనిపుణులతో చర్చిస్తామని, ఈ అన్యాయంపై పోరాటం కొనసాగిస్తామన్నారు.
