పీవీ గురించి ఎవ‌రు గొప్ప‌గా చెప్పినా స్వాగ‌తిస్తాం

పీవీ గురించి ఎవ‌రు గొప్ప‌గా చెప్పినా స్వాగ‌తిస్తాం

హైద‌రాబాద్: మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను కాంగ్రెస్ నేతలు-కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ నేత‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దాశోజు శ్రవణ్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ.. ప్రధానిగా పీవీ చేసిన‌ సేవలను దేశం ఎన్న‌టికీ మ‌రువ‌ద‌న్నారు. ‌పీవీ దేశాన్ని గొప్పగా నడిపించిన తీరును కాంగ్రెస్ నేతలుగా తాము గర్వంగా చెప్పుకుంటామన్నారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను భారత రత్న ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింద‌ని చెప్పారు. ఆసియా ఖండంలోనే అతిపొడవైన ఫ్లై ఓవర్ కి పీవీ నరసింహారావు పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. పీవీ నరసింహారావు గురించి ఎవ‌రూ గొప్పగా చెప్పినా తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. పీవీ శ‌తజ‌యంతి సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫ‌లం

కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింద‌న్నారు ఉత్త‌మ్. కరోనా వచ్చి మూడు నెలల దాటినా.. ఒక్క బెడ్ కూడా ఖాళీగా అందుబాటులో లేదంటే అది సిగ్గుపడాల్సిన అంశమ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు ఒక్క కోవిడ్-19 హాస్పిటల్ మాత్రమే ఉందంటే కేసీఆర్ స‌మ‌ర్ధ‌త తెలుసుకోవ‌చ్చాన్నారు. తెలంగాణకు కోవిడ్ ముప్పు రావడానికి కేసీఆర్ అసమర్థతే కార‌ణ‌మ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ కి రూ.50లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తే సర్కార్ దాన్ని అమల్లోకి తేలేదన్నారు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాల‌ని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు. కోవిడ్ భారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబంలో విద్యుత్ బిల్లులు రద్దు చెయ్యాలన్నారు ఉత్త‌మ్. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అధికంగా ఉన్నందున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జులై 3న బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేస్తామ‌ని తెలిపారు . జులై 4వ తేదీన పెట్రోల్-డీజిల్ తగ్గించాలని నిరసన చేపడుతామ‌న్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీ కలిసి కరొనా నివేదిక ఇస్తుందని ఉత్త‌మ్ ఈ సంద‌ర్భంగా అన్నారు.