కేసీఆర్, హరీశ్, ఈటలకు నోటీసులిస్తే తప్పేంటి?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్, హరీశ్, ఈటలకు నోటీసులిస్తే తప్పేంటి?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కేసీఆర్, హరీశ్, ఈటలకు నోటీసులిస్తే తప్పేంటి? 
  • కాళేశ్వరం కమిషన్​ ముందు హాజరై వివరణ ఇవ్వొచ్చు కదా!: మంత్రి ఉత్తమ్

 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్ ​నోటీసులపై బీఆర్ఎస్​ నేతలు వికృతమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి నిజానిజాలు తెలుసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకే సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జి జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ చైర్మన్‌గా జ్యుడీషియల్ ​కమిషన్ వేశామని తెలిపారు. ‘‘జ్యుడీషియల్​కమిషన్ స్వతంత్ర సంస్థ. దానికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కమిషన్​ కేసీఆర్, హరీశ్​రావు, ఈటల రాజేందర్‌‌కు నోటీసులిస్తే తప్పేంటి? మేం కేవలం కమిషన్​ వేశాం. ఇంకా చర్యలు మొదలుపెట్టలేదు. నోటీసులకే వణికిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. గతంలోనూ కమిషన్లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ, వెంగళరావు లాంటి వాళ్లూ కమిషన్ల ముందు హాజరై వివరణ ఇచ్చారు. మరి, వీళ్లు ఏ తప్పు చేయకుంటే భయమెందుకు? కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వొచ్చు కదా?” అని ప్రశ్నించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. కమిషన్ ​రిపోర్టు ఆధారంగా తప్పు చేసినోళ్లపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ‘‘బాంబులు పెట్టి పేల్చి ఉంటారని కేటీఆర్ అంటున్నారు. మరి కమిషన్‌కు ఆధారాలతో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు (2023 అక్టోబర్​21) బీఆర్ఎస్​ వాళ్లే అధికారంలో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ​కూడా నమోదు చేశారు. కానీ, ఇప్పుడు బాంబులు పెట్టారంటూ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇదే విషయాన్ని ఎఫ్ఐఆర్‌‌లో మెన్షన్ ​చేద్దాం. అలాంటిది లేదంటే మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని మంత్రి హెచ్చరించారు.  

కమీషన్ల కోసమే రీడిజైన్.. 

‘రైతులకు నీళ్లిచ్చేందుకు కాళేశ్వరం రీడిజైన్​చేయలేదు.. కేవలం వాళ్ల జేబులు నింపుకునేందుకే రీడిజైన్​ చేశారు’ అని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును షిఫ్ట్​చేయడమే ఘోర తప్పిదమన్నారు. నియంతృత్వం, అహంకారం, అవినీతి వల్లే దానిని మార్చారని మండిపడ్డారు. ‘‘రాజశేఖర్​రెడ్డి హయాంలో తుమ్మిడిహెట్టి దగ్గర బీఆర్ ​అంబేద్కర్ ​ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేసి.. రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ​అధికారంలోకి వచ్చాక రీడిజైన్​ చేశారు. తుమ్మడిహెట్టి, కేసీఆర్ ​కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు సేమ్. 17 లక్షల నుంచి 18 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంచనా రూ.38 వేల కోట్లయితే.. కాళేశ్వరానికి ఏకంగా రూ.80 వేల కోట్లకు పెంచారు. ఆ తర్వాత వ్యయాన్ని క్రమంగా రూ.1.27 లక్షల కోట్లకు చేర్చారు. ఇప్పుడు దానిని పూర్తి చేయాలంటే లక్షన్నర కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. తుమ్మిడిహెట్టి కన్నా రూ.62 వేల కోట్లు ఎక్కువ. ఆ డబ్బంతా వృథా చేశారు. తుమ్మిడిహెట్టిని నిర్మించి ఉంటే ఈపాటికి రైతులకు నీళ్లు వచ్చి ఉండేవి. అదనంగా ఖర్చు చేసిన ఈ రూ.62 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ పూర్తయి.. 12 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవి. దేవాదులతో 7 లక్షల ఎకరాలు, ఎస్ఎల్‌బీసీతో 3 లక్షల ఎకరాలు, సీతారామసాగర్​పూర్తయి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వచ్చేవి ’’ అని పేర్కొన్నారు.  తుమ్మిడిహెట్టి నుంచి వంద కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా ఒకే ఒక్క లిఫ్ట్​తో ఎల్లంపల్లికి నీటిని తీసుకొచ్చేందుకు వీలున్నా.. అక్కడ నీళ్లు లేవని అబద్ధాలు రాయించారన్నారు. 165 టీఎంసీల నీళ్లున్నా లేవని చెప్పి మేడిగడ్డకు లొకేషన్​ షిఫ్ట్​ చేశారని మండిపడ్డారు. 148 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకున్నదని, ఒప్పందం చేసుకున్నామని చెప్పి.. బేగంపేట ఎయిర్‌‌పోర్ట్​వద్ద ఏనుగులపై ఊరేగి చెప్పిన వాళ్లే.. కేవలం కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం పేరిట రీడిజైన్​ చేశారన్నారు. 

దోపిడీ జరిగిందని తేల్చిన్రు.. 

ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ డిపార్ట్​మెంట్ వంటివి కాళేశ్వరం ప్రాజెక్ట్​లో దోపిడీ, అవినీతి జరిగిందని తేల్చి చెప్పాయని ఉత్తమ్ ​చెప్పారు. ఆ ప్రాజెక్ట్​ వైట్​ఎలిఫెంట్​ అవుతుందని, డిజాస్టర్​ అని కుండబద్దలు కొట్టాయన్నారు. ‘‘మేడిగడ్డ నుంచి ఏటా 195 టీఎంసీలను ఎత్తిపోస్తామన్నారు. కానీ, ఐదేండ్లు కలిపి ఎత్తిపోసింది 165 టీఎంసీలే. అందులో వంద టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు కన్నా కొంచెం అనుభవం ఎక్కువ ఉన్న వాళ్లు, రాజ్యాంగ సార్థకత ఉన్నవాళ్లు ఇన్వెస్టిగేట్​ చేసి 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో తప్పులు జరిగాయని తేల్చి చెప్పారు. కాళేశ్వరం వైట్​ఎలిఫెంట్​అంటూ ఇచ్చిన కాగ్ రిపోర్ట్​ కూడా వాళ్ల హయాంలోనే వచ్చింది. దాన్ని కూడా వాళ్లు తప్పుబడుతున్నారు” అని ఫైర్​ అయ్యారు. 

సీడబ్ల్యూపీఆర్ఎస్‌తో టెస్టులు.. 

బ్యారేజీల వద్ద జియోటెక్నికల్ ​టెస్టులు చేయాలని సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్‌కు విజ్ఞప్తి చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్మన్​ సూచన మేరకు పోలవరం డ్యామ్ నిర్మాణంలో భాగమైన బావర్​అనే సంస్థతోనూ బ్యారేజీల పునరుద్ధరణపై చర్చించామని, వారు రేపో ఎల్లుండో ఇక్కడకు వచ్చి ప్రాజెక్టులను పరిశీలిస్తారని, ఎన్​డీఎస్ఏ రిపోర్టు ప్రకారమే ముందుకు వెళ్తారన్నారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద కొంత మేర నీటి నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం అక్కడ బోర్​హోల్స్​ వేసి టెస్టులు చేయించడం కష్టమైన పని అని చెప్పారు. బీఆర్ఎస్ ​హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్​బీసీ టన్నెల్​కూలిపోయిందని చెప్పారు. టన్నెల్​ సైట్​వద్ద హెలికాప్టర్​ ద్వారా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ​స్టడీ చేయిస్తామన్నారు. త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. ఆర్మీలో టన్నెల్​తవ్వకంలో నిపుణులైన వారిని ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు.

అభిప్రాయాలూ తీసుకుంటున్నం

కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా పునర్వినియోగంలోకి తేవాలన్న దానిపై తాము అందరి అభిప్రాయాలనూ తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్​చెప్పారు. బ్యారేజీల ఫౌండేషనే సరిగ్గా లేదంటూ నిపుణులంతా చెబుతున్నారని పేర్కొన్నారు. షీట్​పైల్స్​కు బదులు సీకెంట్ పైల్స్​ వేశారని, దానినీ సరిగ్గా చేయలేదని అన్నారు. డీపీఆర్​లో ఒక చోట బ్యారేజీలు కడతారని చెప్పి.. వాటి లొకేషన్లను ఎలాంటి టెస్టులూ చేయకుండానే మార్చారని పేర్కొన్నారు. ‘‘2019లో బ్యారేజీలను ప్రారంభించినప్పటి నుంచే లోపాలు బయటపడ్డాయి. అయినా దాన్ని కప్పిపుచ్చి బ్యారేజీల నిండా నీళ్లు నింపారు. 

గోదావరికి జలకళ అంటూ గప్పాలు కొట్టారు. లోపాలు వచ్చినప్పుడే సరి చేసి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడంతోనే సీపేజ్​అయ్యి బ్యారేజీ కుంగిపోయింది. దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఒక పిల్లరే కుంగిందంటూ కప్పి పుచ్చుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘​​కాటన్ ​నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ వందేండ్లకుపైగా నిలబడింది. నాగార్జునసాగర్​, శ్రీశైలం, శ్రీరాంసాగర్​వంటి ప్రాజెక్టులు దశాబ్దాల కాలం నుంచి సేవలు అందిస్తున్నాయి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే ఎందుకు కూలింది” అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్​1లో రూ.21 వేల కోట్లతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్​హౌస్​లు నిర్మించారని.. కానీ ఇప్పుడు అవి పనికిరాకుండా పోయాయన్నారు.