
హైదరాబాద్, వెలుగు: ఓటమి భయంతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు పథకాన్ని ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడా ఆ అంశంపై మాట్లాడలేదని తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, రుణమాఫీ వంటి పథకాలకు డబ్బులు జమ చేయాలని చెప్పాం. రైతుబంధు పెంచాలని మేము చెప్తున్నాం. అలాంటిది ఎందుకు ఆపమని అంటాం?” అని ప్రశ్నించారు.
రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టామని గుర్తు చేశారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్సేనన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని రైతులను నిలువునా మోసం చేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను దేశంలోనే మొదటిసారిగా ఇచ్చింది ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం. బీఆర్ఎస్ వాళ్లు 24 గంటల కరెంట్‌ఇవ్వడం లేదు” అని చెప్పారు.
రైతులకు మోదీ, కేసీఆర్ అన్యాయం
రైతులకు మోదీ, కేసీఆర్ అన్యాయం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని మోదీ డబుల్ చేస్తామన్నారని, కానీ అందులో విఫలమయ్యారన్నారు. రైతులకు పంట నష్టం జరిగితే బీమా ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చత్తీస్‌గఢ్‌లో మాదిరే రాష్ట్రంలోనూ వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకముందే కూలిపోతున్నదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే నాణ్యత లోపించిందన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఫ్యామిలీ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. తెలంగాణలో రాబోయేది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.