సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్​లో అన్నీ లోపాలే: మంత్రి ఉత్తమ్

సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్​లో అన్నీ లోపాలే: మంత్రి ఉత్తమ్
  • హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండా కాలువలు తవ్వితే ఏం ఫాయిదా?: మంత్రి ఉత్తమ్
  • పెండింగ్ ​ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి రిపోర్టివ్వండి
  • ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్‌‌‌‌లో పెట్టండి
  • వర్క్ ​అలాట్‌‌‌‌ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం సీతారామ లిఫ్ట్​స్కీం పేరుతో రీ డిజైన్ చేసిందని, ఇది బ్యాడ్​రీ డిజైనింగ్‌‌‌‌లా ఉందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో అటు ముందుకు కానీ.. ఇటు వెనక్కి కానీ పోలేమన్నట్టుగా పరిస్థితి తయారైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ప్రాజెక్టులపై గురువారం సాయంత్రం సెక్రటేరియెట్‌‌‌‌లో మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్, రెండు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఉత్తమ్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండా కాలువలు తవ్వితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. రెండు, మూడు వందల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో ప్రజలపై భారం పడిందని అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని పెండింగ్ ప్రాజెక్టులను నాలుగు రకాలుగా విభజించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో, ఏడాదిలోగా, 18 నెలల్లోగా, 24 నెలల్లోగా పూర్తయ్యే ప్రాజెక్టులుగా విభజించి వాటికి కావాల్సిన బడ్జెట్, అంచనా వ్యయంతో నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్​లో పెట్టాలని, ఏజెన్సీలకు వర్క్​అలాట్ చేయకుండా ఆపేయాలని ఆదేశించారు. చెరువుల రిపేర్లు, చెక్​డ్యామ్​ల నిర్మాణం కోసం ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫార్సులను తీసుకొని వాటికి కావాల్సిన నిధులు మంజూరుకు కృషి చేయాలని చెప్పారు.

రీ డిజైనింగ్​ పేరుతో నిధుల దుర్వినియోగం: భట్టి

ఉమ్మడి రాష్ట్రంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టుగా మార్చి అంచనాలను రూ.13 వేల కోట్లకు పెంచి నిధులు దుర్వినియోగం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టు పెరగకుండానే అంచనా వ్యయం ఎందుకు పెరిగిందని నిలదీశారు. దీంతో ఇంజినీర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. భూసేకరణ, కోర్టు కేసులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యం కావడంతోనే ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని వారు వివరించారు. సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి మరో రెండు నెలల్లో ఎన్విరాన్​మెంట్ క్లియరెన్స్ వచ్చే అవకాశముందని తెలియజేశారు. దీంతో శబరి, గోదావరి సంగమం వద్ద 365 రోజులు నీటి లభ్యత ఉంటుందని, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశమున్నా లిఫ్ట్​స్కీం చేపట్టి అంచనాలు పెంచేశారని భట్టి మండిపడ్డారు. అయితే గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం కారణంగానే రీ డిజైనింగ్​ చేయాల్సి వచ్చిందని ఇంజినీర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీతారామ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని భట్టి ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న జాలుముడి, మున్నేరు ఆనకట్టల అంచనా వ్యయం రూపొందించాలని సూచించారు. సీతారామ హెడ్​వర్క్స్ నుంచి కాలువల వరకు ప్యాకేజీల వారీగా చేసిన పనుల వివరాలు చెప్పాలని ఇంజినీర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈఈ తత్తరపడటంతో చేసే పనిపై అవగాహన లేకుంటే ఎలా అని మందలించారు. నాగార్జునసాగర్​లో నీటి లభ్యత ఎలా ఉందని ఆరా తీశారు. ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పదేండ్లలో పనులు ఎందుకు పూర్తి చేయలే: వెంకట్‌‌‌‌ రెడ్డి

నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చే ఎస్ఎల్బీసీ టన్నెల్​ప్రాజెక్టు, డిండి లిఫ్ట్​స్కీం, ఉదయ సముద్రం ప్రాజెక్టులను గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నాటికే ఎస్ఎల్బీసీ టన్నెల్​ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, పదేళ్లలో మిగతా పది శాతం పనులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్​రిజర్వాయర్, సింగరాజుపల్లి, పెండ్లిపాకల, గొట్టెముక్కుల, నక్కలగండి, చర్ల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్​లిఫ్ట్​పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీశారు.