న్యాయ వ్యవస్థనే అవమానిస్తరా?.. జ్యుడీషియల్ కమిషన్ అంటే లెక్కలేదా?: ఉత్తమ్

న్యాయ వ్యవస్థనే అవమానిస్తరా?.. జ్యుడీషియల్ కమిషన్ అంటే లెక్కలేదా?: ఉత్తమ్
  •  హరీశ్​రావుపై మండిపడిన మంత్రి ఉత్తమ్ 
  • కాళేశ్వరం కమిషన్ ​ఎంక్వైరీలో కేసీఆర్, హరీశ్​ బండారం బయటపడింది
  • ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనని వాళ్లకు భయం పట్టుకుంది
  • వాళ్లు వేల కోట్ల అవినీతి చేస్తే ఒప్పు.. మేం విచారణ చేస్తే తప్పా?
  • గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ ​నేతల్లో మార్పు రాలేదని ఫైర్

హైదరాబాద్​, వెలుగు: ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం ఉందని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీకి చట్ట సభలన్నా, న్యాయస్థానాలన్నా గౌరవం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు రిటైర్డ్​జడ్జి నేతృత్వంలో నియమించిన జ్యుడీషియల్​కమిషన్​ అంటే కూడా లెక్కలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో ఇప్పటికీ మార్పు రాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు పాతరేసి, ఆర్థికంగా రూ.లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్​నివేదిక నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై హరీశ్​రావు ప్రజంటేషన్ ఇవ్వగా.. ఆయనకు ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. 

బీఆర్ఎస్ నేతల బండారం బయటపడడంతోనే కాళేశ్వరం కమిషన్‌‌‌‌పై వాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును తప్పబట్టిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసీ ఘోష్‌‌‌‌ను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడీషియల్ కమిషన్ విచారణలో బయటపడింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్​రావుల బండారం బట్టబయలైంది. అందుకే తేలు కుట్టిన దొంగల్లా.. హరీశ్​రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ నేతల నిజస్వరూపాన్ని జ్యుడీషియల్ కమిషన్ బయటపెట్టింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే మా ప్రభుత్వం వెల్లడించింది. అది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్​రావు మరిచిపోయినట్లున్నారు’’ అని అన్నారు.  

సమగ్ర విచారణ జరిగింది.. 

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వరకు జరిగిన అవకతవకలన్నింటిపైనా కమిషన్ సమగ్రంగా విచారణ చేసిందని మంత్రి ఉత్తమ్​తెలిపారు. ఎవరెవరు తప్పులు చేశారో.. ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను కూడా ఈ నివేదికలో వెల్లడించిందని చెప్పారు. ‘‘అప్పటి సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి హరీశ్​రావును కూడా జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. వాళ్లిద్దరూ స్వయంగా జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్​ రావు.. ఆరోజు కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదు? హరీశ్​అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయవ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయి. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. జ్యుడీషియల్ కమిషన్ విచారణలో కేసీఆర్ పాత్ర ఏమిటో, హరీశ్ రావు చేసిన ఘనకార్యాలేమిటో తేలిపోయింది’’ అని అన్నారు. అబద్ధాలు చెబుతూ తెలంగాణ ప్రజలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారని ఫైర్​ అయ్యారు. 

వాళ్లకు భయం పట్టుకుంది.. 

కాళేశ్వరం కమిషన్​నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న భయం బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నదని మంత్రి ఉత్తమ్​అన్నారు. అందుకే కమిషన్ నివేదికను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని మండిపడ్డారు. న్యాయబద్ధమైన కమిషన్‌‌‌‌కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా వారికే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారని, తమ ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇక్కడే కాదు.. ఎక్కడైనా పనులు జరగకుండా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వకూడదని సీఎం రేవంత్​స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఉత్తమ్​ తెలిపారు.

చేసిన తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి 

‘‘ఇంకెన్నాళ్లు తెలంగాణ ప్రజల కళ్లుగప్పి మభ్యపెడతారు. విచారణ కమిషన్ తేల్చిన విషయాలపైనా, ఇచ్చిన నివేదికపైన అసెంబ్లీలో చర్చిస్తామని మా ప్రభుత్వం ప్రకటించింది. కాళే శ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీసులో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలి. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు..  మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా? కమీషన్ల కక్కుర్తితో ప్రజలను, రైతులను పదేళ్లపాటు మోసం చేశారు. కుంగి పోయే ప్రాజెక్ట్ కట్టినందుకు హరీశ్​ సిగ్గుపడాల్సింది పోయి.. అది తమ గొప్పతనం అని జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా మరోసారి డూప్ ప్రజంటేషన్ ఇచ్చారు’’ అని ఉత్తమ్​ అన్నారు.