గంగలో స్నానం కోసం వెళుతూ.. చెరువులో పడిన ట్రాక్టర్.. 20 మంది జల సమాధి

గంగలో స్నానం కోసం వెళుతూ.. చెరువులో పడిన ట్రాక్టర్.. 20 మంది జల సమాధి

మాఘ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని.. పుణ్యం కోసం గంగా నదిలో కదర్ గంజ్ ఘాట్ దగ్గర స్నానం చేయటానికి వెళుతున్న 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ప్రమాదం సంచలనంగా మారింది. కాస్ గంజ్  ప్రాంతానికి చెందిన 30 మంది గ్రామస్తులు.. ఓ ట్రాక్టర్ ట్రాలీలో గంగానది కదర్ గంజ్ ఘాట్ కు బయలుదేరారు. మార్గమధ్యలో పాటియాలి కాత్వాలి ప్రాంతంలో.. స్పీడ్ గా వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. చనిపోయిన 20 మందిలో.. ఏడుగురు చిన్న పిల్లలు.. ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మాఘ పుర్ణిమ పురస్కరించుకుని గంగానదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్ వెళ్తుండగా  కాస్ గంజ్ లో ట్రాక్టర్ అదుపు తప్పి   చెరువులో పడిపోయిందని కాస్ గంజ్ ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ తెలిపారు.  ఘటనా స్థలానికి వచ్చిన  DM, SP, పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని  జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇంకా  సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.