వరుడు పేపర్ చదవలేదని పెళ్లొద్దన్న వధువు

వరుడు పేపర్ చదవలేదని పెళ్లొద్దన్న వధువు

పెళ్లి కొడుకు న్యూస్ పేపర్ చదవలేదని పెళ్లి కూతరు పెళ్లిని క్యాన్సల్ చేసుకుంది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని యురేయా పరిధిలో జరిగింది. సదర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్‌పూర్ గ్రామానికి చెందిన అర్చనకు, బాన్షి గ్రామంలో నివసించే శివమ్‌‌తో వివాహం కుదిరింది. ఇరుకుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు.

కొన్ని రోజుల తర్వాత వివాహ తేదీ రానే వచ్చింది. పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. అయితే ఆ రోజు పెళ్లి కొడుకు అద్దాలు పెట్టుకోవడాన్ని పెళ్లి కూతురు, ఆమె బంధువులు గమనించారు. వారికి పెళ్లి కొడుకు అద్దాలు పెట్టుకోవడంపై అనుమానం వచ్చింది. దాంతో అద్దాలు లేకుండా న్యూస్ పేపర్ చదవాలని పెళ్లికూతురు పెళ్లి కొడుకును అడిగింది. అప్పుడు జరిగిన సంఘటనతో పెళ్లి కూతురు కుటుంబం మొత్తం షాక్‌కు గురయింది. పెళ్లి కొడుకు అద్దాలు లేకుండా న్యూస్ పేపర్ చదవలేకపోయాడు. దాంతో పెళ్లికొడుకు తన ఐ సైట్ గురించి చెప్పకుండా దాచి తమను మోసం చేశాడని పెళ్లి కూతురు పెళ్లిని క్యాన్సల్ చేసుకుంది.

ఈ విషయంపై వధువు తండ్రి అర్జున్ సింగ్ మాట్లాడుతూ.. ‘పెళ్లికొడుకు కంటి చూపులో సమస్య ఉందని మాకు ముందుగా తెలియదు. పెళ్లి రోజు నిజం తెలియడంతో నా కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో మేం పెళ్లిని క్యాన్సల్ చేశాం. అయితే పెళ్లికి గాను మేం వరుడి కుటుంబానికి ఇచ్చిన డబ్బులు, బైకును తిరిగివ్వాలని అడిగాం. మా డిమాండ్‌ను పెళ్లి కొడుకు కుటుంబం ఒప్పుకోలేదు. దాంతో యురేయాలోని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాం. పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, వరుడి కుటుంబసభ్యులు మాత్రం ఎవరూ ఇప్పటివరకూ ముందుకు రాలేదు.