ఢిల్లీ వేదికగా వేడెక్కిన యూపీ పాలిటిక్స్

ఢిల్లీ వేదికగా వేడెక్కిన యూపీ పాలిటిక్స్
  • కేంద్ర మంత్రులు సహా బీజేపీ పెద్దలను కలుస్తున్న సీఎం యోగి
  • రేపు ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం
  • యూపీ సీఎం యోగి మార్పుపై దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ప్రచారం

న్యూఢిల్లీ: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు లాంటి ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తాజాగా ఢిల్లీ వేదికగానే పరిణమాలు శరవేగంగా మారుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యూపీ సీఎం యోగి మార్పు జరగవచ్చంటూ దేశ రాజధాని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో సీఎం యోగి గురువారం నాడు అనూహ్యంగా ఢిల్లీ చేరుకుని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవుతుండడంతో ఊహాగానాలు తారస్థాయికి చేరుకున్నాయి. 
తాజా సమాచారం ప్రకారం హోం మంత్రి అమిత్ షాతో సీఎం యోగి భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కావాల్సి ఉంది. వీరి సమావేశానికి ముందు ప్రధాని మోడిని బిజేపి చీఫ్ నడ్డా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపి సీఎం మార్పుపై దేశ రాజధానిలో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. రకరకాల ఊహాగానాల మధ్య ఢిల్లీ లో యోగి అనూహ్య పర్యటన కొనసాగుతుండడం ఉత్కంఠ రేపుతోంది. వరుసగా ఒకరి తర్వాత మరొకరితో బీజేపీ పెద్దలను కలుస్తోన్న సీఎం యోగి రాత్రిలోగా బీజేపీ చీఫ్ నడ్డాతో భేటి జరపనున్నారు. అనంతరం రేపు ప్రధాని మోడితో భేటి జరిగే అవకాశం ఉందని సమాచారం. 
దేశ రాజధానిలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని.. ముఖ్యంగా యూపీ సీఎం యోగి మార్పును బీజేపీ పార్టీ వర్గాలు కొట్టివేస్తున్నాయి. పార్టీలో ఎన్నో విషయాలు చర్చించుకుంటుంటారు. మీడియాలో టీఆర్పీ కోసం ఏవేవో వండి వార్చుకుంటే మాకేం సంబంధం లేదన్నట్లు తేలిక చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా యోగి సొంత నియోజక వర్గం గోరఖ్ పూర్ లో బీజేపీ పార్టీ వెనుకబడిపోవడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో సీఎం యోగి మార్పు వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.