ఓటేసిన ఉత్తరాఖండ్, గోవా సీఎంలు

ఓటేసిన ఉత్తరాఖండ్, గోవా సీఎంలు

గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. అలాగే ఇవాళే యూపీలోని 55 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ సాగుతుంది. పొద్దున్న నుంచే ఓటర్లు భారీగా క్యూలు కట్టారు. సామాన్యులు నుంచి ప్రముఖులు, మంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తన భార్యతో కలిసి ఖతీమాలో ఉదయాన్నే ఓటు వేశారు. ఈ సందర్భంగా మరోసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. తాము అమలు చేసిన పథకాలు ఉత్తరాఖండ్ ప్రజలకు ఒక రక్షణ కవచంలా నిలిచాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు పని చేస్తారన్నది ప్రజలకు బాగా తెలుసని, మొత్తం 70 స్థానాల్లో 60కి పైగా బీజేపీని గెలిపిస్తారని ప్రజలపై భరోసా ఉందని చెప్పారాయన.

గోవాలో పూజ చేసి.. ఓటు వేసిన సీఎం

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లకు ఇవాళ పోలింగ్ షురూ అయింది. ఉదయం 8 గంటల నుంచి జనం బారులు తీరి ఓట్లు వేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఆయన భార్య సులక్షణ కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు ఆయన హర్వలెంలోని శ్రీ రుద్రేశ్వర దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఓటు వేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుందన్నారు. ఇన్నేండ్లుగా బీజేపీ ప్రభుత్వం చేసిన పనులు ప్రజల ముందున్నాయని, ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

సామాన్యుడిలా క్యూలో నిల్చుని ఓటేసిన కేంద్ర మంత్రి

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో ఏడు దశలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. ఇప్పటికే తొలి దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇవాళ మరో 55 నియోజకవర్గాల్లో రెండో దశ ఓటింగ్ సాగుతోంది. ఈ ఉదయం షాజహాన్ పూర్ లో రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సామాన్యుడిలా క్యూలో నిల్చుని ఓటు వేశారు. రామ్ పూర్ లో ఉదయాన్నే పోలింగ్ బూత్ కు వెళ్లిన ఆయన దాదాపు 20 నిమిషాల పాటు క్యూలో ఉండి తన వంతు వచ్చాక ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఓటేసినోళ్ల కోసం ఆఫర్లు

పుల్వామా ఘాతుకానికి ఇవాళ్టితో మూడేళ్లు

మరో 54 చైనా యాప్స్పై నిషేధించిన భారత్