గోవా, ఉత్తరాఖండ్, యూపీల్లో పోలింగ్ షురూ

గోవా, ఉత్తరాఖండ్, యూపీల్లో పోలింగ్ షురూ
  • ఎలక్షన్​ 2 ఇయ్యాల్నే
  • ఉత్తరప్రదేశ్​లో సెకండ్​ ఫేజ్​: 55 సీట్లకు
  • గోవాలో సింగిల్​ ఫేజ్​: 40 సీట్లకు
  • ఉత్తరాఖండ్​లో సింగిల్​ ఫేజ్​: 70 సీట్లకు

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ షురూ అయ్యింది. 9 జిల్లాల్లోని 55 సీట్లలో 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌‌, గోవాలోనూ అసెంబ్లీ ఎన్నికలు సోమవారమే సింగిల్‌‌ ఫేజ్‌‌లో జరుగుతున్నాయి. యూపీ, గోవాలో ఉదయం ఏడు నుంచి.. ఉత్తరాఖండ్‌‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ సాగనుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

9 జిల్లాల్లో పట్టు ఎవరిదో?

యూపీలోని సహరణ్‌‌పూర్, బిజ్నూర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, ఆమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్‌‌పూర్ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఏరియాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కు వ. గత ఎన్నికల్లో ఈ 55 సీట్లలో బీజేపీ 38 సీట్లు గెలవగా, ఎస్పీ 15 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించాయి. మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన ధరమ్ సింగ్ సైనీ కూడా పోటీలో ఉన్నారు. రాంపూర్‌‌‌‌ నుంచి ఎస్పీ కీలక నేత ఆజం ఖాన్, షాజహాన్‌‌పూర్ నుంచి మంత్రి సురేశ్ ఖన్నా, నాకుడ్ నుంచి సైనీ పోటీలో ఉన్నారు. ప్రస్తుత మంత్రులు బల్దేవ్ సింగ్ ఔలాఖ్.. బిలాస్‌‌పూర్ నుంచి, మహేశ్ చంద్ర గుప్తా.. బడౌన్‌‌ నుంచి, గులాబ్ దేవీ.. చందౌసీ నుంచి పోటీ చేస్తున్నారు. బరేలీ మాజీ మేయర్ సుప్రీయా ఆరోన్.. బరేలీ కంటోన్‌‌మెంట్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ఓట్ల కోసం ఎన్నెన్ని పాట్లో!

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రజల ఓట్ల కోసం నాయకులు పాట్లు పడుతున్నారు. జనాన్ని ఆకర్షించేందుకు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రస్తుత మంత్రి సురేశ్ ఖన్నా.. దేశభక్తి పాటలు పాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకో మంత్రి బ్రిజేశ్ పాథక్.. రోడ్డు పక్కన చిన్న హోటల్‌‌లో పూరీలు కాలుస్తున్నారు. అంతేనా.. టైలర్ షాపులోకి వెళ్లి బట్టలు కూడా కుట్టారు. ఇక మొహమ్మదాబాద్‌‌ గొహ్నా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భన్వరీలాల్.. ఎమోషనల్‌‌గా ప్రచారం చేస్తున్నారు. ‘‘నాకు ఓటు వేయండి. లేదా.. కఫాన్ (శవంపై కప్పే బట్ట) ఇవ్వండి” అంటూ ఓటర్లను అడుగుతున్నారు. ‘ఓట్ యా కఫాన్’ అని రాసి ఉన్న పాంప్లెట్లు పంచుతున్నారు. సిరాథు సీటు నంచి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ చేస్తున్నారు. ఇతర బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో మౌర్య కోసం ప్రచారం చేసేందుకు ఢిల్లీ నుంచి డ్రామా గ్రూప్‌‌ను పిలిపించారు. ఆ డ్రామా గ్రూప్.. గ్రామాల్లో స్కిట్స్ వేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ లీడర్​ ప్రియాంకా గాంధీ.. వ్యవసాయ భూముల్లో పర్యటిస్తున్నారు. అక్కడ పనిచేసే మహిళలతో మాట్లాడుతున్నారు. చెరుకు రైతులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక రోడ్‌‌ షోలు, ఇంటింటి ప్రచారాలు, ఓటర్లతో సెల్ఫీలు, పిల్లలను ఆడించడం.. వంటివెన్నో ఎన్నికల సిత్రాలు కనిపిస్తున్నాయి.

గోవాలో ఓటేసినోళ్లకు డిస్కౌంట్లు

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గోవాలో వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఓటు వేసి వచ్చిన వాళ్లకు కాఫీ షాపులు, హోటళ్లు, బంగీ జంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లపై ప్రత్యేక తగ్గింపులు ఇస్తామని ప్రకటించారు. పోలింగ్, వాలెంటైన్స్‌‌ డే ఒకటే రోజు రావడంతో నార్త్ గోవాలోని 30 హోటళ్ల యజమానులు ఫుడ్ ఆర్డర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. గోవాలో 40 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 301 మంది పోటీలో ఉన్నారు. 11 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌‌కు తోడు ఈసారి ఆప్, టీఎంసీ, శివసేన-ఎన్సీపీ కూటమి కూడా పోటీపడుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 13 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు సాధించాయి. పోస్ట్ పోల్ అలయన్స్‌‌తో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీటా శ్రీధరన్ టలైగవోలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉత్తరాఖండ్‌‌లో ముక్కోణ పోటీ

70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌‌లో సోమవారం పోలింగ్ షురూ అయింది. 632మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరిలో 152 మంది ఇండిపెండెం ట్లు పోటీ చేస్తున్నారు. మొత్తం 81 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా కొనసాగనుంది. సీఎం ధామి, మంత్రులు సత్పాల్ మహారాజ్, సుబోధ్ ఉనియాల్, అర్వింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మదన్ కౌశిక్.. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్, ఆ పార్టీ స్టేట్ చీఫ్ గణేశ్ గొడియాల్ తదితరులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ కు11 సీట్లు, ఇండిపెండెంట్లు 2 సీట్లు గెలుచుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు నడవగా.. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ రేసులోకొచ్చింది. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.

మరిన్ని వార్తల కోసం..

2022లో ఇస్రో తొలి ప్రయోగం విజయవంతం

సర్జికల్ స్ట్రైక్స్ పై నాకూ అనుమానాలున్నయ్

ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు హెల్త్ స్టాఫ్​కు వెయిటేజీ