పూజారుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఉత్తరాఖండ్

పూజారుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఉత్తరాఖండ్

అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  వివాదాస్పద చార్ ధామ్ దేవస్థానం బోర్డు బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. నిరసనలు చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఆందోళనను విరమించుకోవాలని కోరారు. మనోహర్ కాంత్ ధ్యాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా, దేవస్థానం బోర్డు చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

2019 డిసెంబర్‌లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ పుణ్యక్షేత్ర నిర్వహణ బిల్లును  2019లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ బోర్డు పరిధిలో  బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి , యమునోత్రితో పాటు 49 ఇతర దేవాలయాలు ఉన్నాయి.  ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం నిర్వహణ చట్టం, 2019 ప్రకారం, అప్పటి సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జనవరి 15, 2020న ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘించారంటూ.. బోర్డు పరిధిలోని ఆలయ పూజారులు నిరసన తెలుపుతున్నారు. బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే బోర్డును రద్దు చేస్తున్నట్టు తెలిపారు.