శ్రీకాకుళం జిల్లాలో టూరిస్టు బస్సు దగ్దం

శ్రీకాకుళం జిల్లాలో టూరిస్టు బస్సు దగ్దం

ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌కి చెందిన భక్తులు రెండు బస్సులలో 10 రోజుల క్రితం సౌత్ ఇండియా టూర్‌కు బయలుదేరారు. వీరంతా శనివారం ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకొని విశాఖకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఒక బస్సు పైడిభీమవరం వద్దకు రాగానే, స్థానికంగా ఉన్న ఓ కంపెనీకి చెందిన బస్సు టూరిస్టు బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అయితే టూరిస్టు బస్సు వోల్వో బస్సు కావడం, దాని ఇంజన్ బస్సుకు వెనుక భాగంలో ఉండటంతో, ప్రమాదం జరిగిన వెంటనే టూరిస్టు బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో టూరిస్టు బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో 15 మంది భక్తులకు గాయాలయ్యాయి. మంటలు వ్యాపించడంతో.. కంపెనీకి చెందిన ఉద్యోగులు వెంటనే టూరిస్టు బస్సులో ఉన్న వారిని కిందకు దించడంతో ప్రాణనష్టం తప్పింది. గాయపడిన వారందరిని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. భక్తులను విశాఖకు తరలించి, అక్కడి నుంచి ట్రైన్ ద్వారా వారి స్వస్థలాలకు పంపించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.