రంగయ్య ఒక రోజు ఉదయాన్నే లేచి ఊరి బయట ఉన్న అడవికి వెళ్ళాడు. అడవి లోపల చాలా దూరం వెళ్ళి, ఒక చెట్టు దగ్గర ఆగాడు. తను తీసుకెళ్ళిన తాడును ఆ చెట్టు కొమ్మకు కట్టి ఉరి వేసుకోసాగాడు. అక్కడే తపస్సు చేసుకుంటున్న ఒక ముని అది చూశాడు. దగ్గరికి వచ్చి రంగయ్య ప్రయత్నాన్ని ఆపబోయాడు. ‘‘నన్ను ఆపొద్దు. నేను చనిపోవాలి’’ అన్నాడు రంగయ్య.
‘‘నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో నాకు చెప్పు. నీకేదైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తా. లేదంటే అప్పుడు నువ్వు తప్పకుండా చనిపోదువు’’ అన్నాడు ముని.‘‘ఇంట్లో, బయటా ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఎవరూ నాకు అనుకూలంగా ఉండటం లేదు. నేను జీవితం అంటే విసిగిపోయా. అందుకనే చనిపోవాలనికుంటున్నా’’ అన్నాడు రంగయ్య.‘‘ఇంట్లో వాళ్ళను లేదా బయటివాళ్ళను మార్చే ప్రయత్నం ఏదైనా చేశావా?’’ అని అడిగాడు ముని. చేయలేదన్నాడు రంగయ్య. ‘‘ప్రయత్నం ఏమీ చేయకుండా ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్?’’ అని అడిగాడు ముని. రంగయ్యలో ఆవేశం తగ్గింది. ఆలోచనలో పడ్డాడు. ‘‘అయితే నన్ను ఏమి చేయమంటారు?’’ అడిగాడు రంగయ్య.
‘‘ముందు బయటి వాళ్లను మార్చే ప్రయత్నం చెయ్యి. ఈ రోజు నుండీ ఒక నెల రోజుల తర్వాత వచ్చి నాకు కనపడు’’ అన్నాడు ముని. సరేనని మునికి నమస్కరించి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు రంగయ్య. నెల రోజుల తర్వాత అడవిలోని ముని దగ్గరకు వచ్చాడు రంగయ్య. ‘‘ప్రయత్నం చేశావా?’’ అని అడిగాడు ముని. ‘‘చేశాను స్వామి. నా పక్క ఇళ్ళవాళ్ళని, నా వీధిలోనివాళ్ళని, నేను పనిచేసే ప్రదేశంలోనివాళ్ళని మార్చే ప్రయత్నం చేశా. ఎవరూ నా మాట వినటం లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోవటం లేదు. మీరంతా మారాలని నేను చెప్తే, వాళ్ళు నన్ను హేళనచేస్తున్నారు’’ అన్నాడు రంగయ్య. ‘‘బయటి వాళ్ల సంగతి సరే. ఈసారి ఇంట్లో వాళ్లని మార్చే ప్రయత్నం చెయ్యి. నెల రోజుల తర్వాత వచ్చి నాకు కనపడు’’ అన్నాడు ముని. సరేనని మునికి నమస్కరించి అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు రంగయ్య. నెల రోజుల తర్వాత అడవిలోని ముని వద్దకు వచ్చాడు రంగయ్య. ‘‘ప్రయత్నం చేశావా?’’ అని అడిగాడు ముని. ‘‘చేశాను స్వామి. నా భార్య, పిల్లలు నా మాట వినటం లేదు, నేను చెప్పేది అర్థం చేసుకోవటం లేదు. ‘‘మీరు మారాలి’’ అని నేను చెప్తే... నా వైపు ఒకసారి చూసి, -నా ముందు నుండీ అవతలికి వెళ్ళిపోతున్నారు’’ చెప్పాడు రంగయ్య.
‘‘నువ్వు ఎంత ప్రయత్నించినా ఇంట్లో వాళ్ళుగానీ, బయటవాళ్ళుగానీ మారటం లేదు. నిన్ను అర్థం చేసుకోవడం లేదు. నీకు అనుకూలంగా ఉండటం లేదు. అంటే మారాల్సింది నువ్వేనేమో ఆలోచించు. నువ్వే వాళ్ళను అర్థం చేసుకుంటే, నువ్వే వాళ్లకు అనుకూలంగా ఉంటే సరిపోతుంది కదా. ఈ మాత్రం దానికి ప్రాణం తీసుకోవటం ఎందుకు?’’ అన్నాడు ముని. ఒక్కసారిగా విషయం అర్థమైంది రంగయ్యకు.‘‘నేను అలా ఆలోచించలేదు స్వామి. మీ సాయం నేను జన్మలో మరచిపోను’’ అని ముని పాదాలకు నమస్కరించి తన ఇంటికి వెళ్లాడు రంగయ్య. ఆ తర్వాత రంగయ్య ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయలేదు.
- కళ్ళేపల్లి తిరుమలరావు
