పదేండ్ల V6 జర్నీ

పదేండ్ల V6 జర్నీ

జనంతో కలిసి ప్రయాణం. జనం కోణంలో జర్నలిజం. జనం ఉనికి గుర్తించి.. గౌరవించి.. బతుకులు మార్చడానికి ప్రయత్నిస్తే.. ఎంతగా ఆదరిస్తారో చెప్పడానికి నిలువెత్తు తెలంగాణ అద్దం... వీ6 న్యూస్. పదేండ్ల ప్రయాణం పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

మన తెలంగాణ ఊళ్లల్ల మామూల మన్షులు ఎట్లుంటరు? 
నవ్వొస్తే నవ్వుతరు. దుఃఖమొస్తే ఏడుస్తరు. కడుపులో బాధయితే దాచిపెట్టుకోకుండా బయటపెడతరు. మనసులో ఏదున్నా కుళ్లు, కుతంత్రం లేకుండా కుల్లంకుల్ల చెప్పుకుంటరు. నచ్చితే నెత్తినపెట్టుకుంటరు. నచ్చకుంటే బాజాప్త చెప్తరు.  మనసుల ఏం పెట్టుకోరు. మన ఊరోళ్లు ఎట్లుంటరో.. మన వీ6 న్యూస్ ఛానెల్‌‌ కూడా అట్లే ఉంటది. అందుకే ఛానెల్ల ఊరి మనసు కనిపిస్తది. తెలంగాణ తీరు కనిపిస్తది. మొత్తంగా తెలంగాణే కనిపిస్తది. అందుకే తెలంగాణ జాతి అంతా ఇంట్లో టీవీలోనే కాదు మనసు నిండా ఛానెల్‌‌ను పెట్టుకొని దీవెనార్తులు ఇచ్చింది. అట్ల ఎదిగిన మన వీ6 న్యూస్ పదేండ్ల పండుగ చేసుకొని పదకొండో ఏట అడుగుపెట్టింది. 

మారుమూల పల్లెలో గోసి కట్టుకునే మనుషుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వీ6 ఛానెల్‌‌ ప్రేక్షకులే. వార్తల కోసం ఛానెల్‌‌ను చూడడం మామూలే. కానీ ఇది మన ఛానెల్‌‌ అనే అంతులేని అభిమానం చూపడం వీ6 అందుకున్న ప్రత్యేక గౌరవం. అనవసరమైన బ్రేకింగ్​లు లేకుండా, మొగుడూపెండ్లాల ఇంటి గొడవలు, సెలబ్రిటీల విడాకులకు కారణాలపై చర్చలు, సిన్మోళ్ల సొంతగుట్లు, గాసిప్పులు వేస్తేనే జనం ఛానెల్‌‌ చూస్తరన్న ట్రెండ్‌‌ను బద్దలు కొట్టి తెలంగాణ పల్లెబాటను, పట్నం బతుకును చూపిస్తూ ఆదరణ తెచ్చుకోవడమే వీ6 ప్రత్యేకం. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇదే తెలంగాణ బతుకు మార్క్.

జనం రేటింగ్.. మీటర్ రేటింగ్

టీవీ ఛానెల్‌‌ అనగానే రేటింగ్ ఎంత అనే మాటే వినిపిస్తుంది. తెలంగాణలో ఏ మూలకు పోయినా రేటింగ్ అడగకుండానే తెలంగాణ  నెంబర్ 1 అని చెప్పే ఒకే ఒక్క ఛానెల్‌‌గా వీ6 నిలిచింది. నెంబర్లను మీటర్లు, మేటర్లు నిర్ణయించే రోజుల్లో జనం తిరుగులేకుండా నిండైన మనసుతో పదేండ్లుగా రేటింగ్ ఇస్తూనే ఉన్నరు. అందుకే నెంబర్లు చూసుకోకుండా నడిచే ఒకే ఒక్క ఛానెల్‌‌గా వీ6 ఎదిగింది. మరి నెంబర్ల మాటేంటి? రేటింగ్ లో కూడా తెలంగాణలో వీ6 ఛానెలే ఎప్పుడూ ముందుంటోంది. రేటింగ్​లో ఎన్ని రకాలుగా ఇచ్చినా తెలంగాణలో, హైదరాబాద్‌‌లో జనం ఆదరణతో టాప్ ఛానెల్‌‌గా నిలుస్తోంది. మీటర్లు మేనేజ్ చేసుకుంటే చాలు, జనం చూడకపోయినా పర్లేదనుకునే కాలంలో రేటింగ్ లో ముందుంటూనే, ఈ విధానంలోని లోపాలపై నిజాయితీగా న్యాయ పోరాటం చేసింది వీ6. ఇది జనం ఇచ్చిన ధైర్యం. మంచి ఛానెల్‌‌ను జనం ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ పోరాటం చేసింది.

తెలంగాణ డిజిటల్ పవర్

చైతన్యం అంటేనే తెలంగాణ. సాయుధపోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ ప్రతిపోరాటంలోనూ చైతన్యం చూపింది. చదువుకోవడం, చదువురాకపోవడం దానికి అడ్డంకి కాదు. మారుతున్న కాలంతో పాటు మన సమాజమూ మారింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా డిజిటల్ ఫ్లాట్ ఫాంలను ఉపయోగించుకోవడంతో దూసుకుపోతోంది. దీనికి కళ్లకుకట్టే నిదర్శనం.. వీ6 డిజిటల్ వేదికల బలం. నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణలో దాదాపు 80 లక్షల మంది యూట్యూబ్ సబ్‌‌స్క్రయిబర్లు ఉన్న ఏకైక ఛానెల్​గా నిలిచింది. యూట్యూబ్ తెలుగు న్యూస్ ఛానెళ్లలో 10 లక్షల సబ్‌‌స్క్రయిబర్ల మైలురాయిని చేరుకొని యూట్యూబ్ నుంచి ‘గోల్డ్ బటన్’ అందుకున్న మొదటి ఛానెల్‌‌ వీ6 న్యూస్. సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్యతో పనిలేకుండా రోజూ కోట్లమంది వీ6 వీడియోలను చూస్తుంటారు. అలాగే ఫేస్​బుక్​లోనూ 20 లక్షల మందికిపైగా ఫాలోయర్స్​తో యాక్టివ్ వేదికగా గుర్తింపు తెచ్చుకుంది. సబ్‌‌స్క్రయిబర్లను, ఫాలోయర్స్ ను కొనుక్కుని పెంచుకునే కాలంలో అందుకు భిన్నంగా జనానికి నచ్చి, మెచ్చి ఫాలో అయ్యేవాళ్లు (ఆర్గానిక్ వ్యూయర్స్) ఉన్న పెద్ద సోషల్ వేదికగా గౌరవంగా నిలిచింది. ఫేస్​బుక్​తో పాటు వెబ్​సైట్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లాంటి డిజిటల్ వేదికలపైనా రోజూ కోట్ల మందికి వార్తలను అందిస్తోంది. మంచి న్యూస్ వేదికలను కోరుకునే తెలుగు జనం పల్లె నుంచి విదేశాల వరకు ఆదరించడం వల్లే కోట్ల సంఖ్యలో వీ6 డిజిటల్ ప్లాట్​ఫామ్​లను ఫాలో అవుతున్నారు.

ఉద్యమానికి పెద్ద గళం

పదేండ్ల కిందట తెలంగాణ ఉద్యమం కీలకదశలో ఉన్నప్పుడు వీ6 ప్రసారాలు మొదలయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ వస్తదో, రాదో అర్థంకాక, ఇంక రాదేమోనన్న అనుమానంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి చూసి ఉద్యమానికి వేదికగా మారింది వీ6. పార్టీలు, వర్గాలకు అతీతంగా సబ్బండ వర్గాల ఆకాంక్షలను వినిపిస్తూ స్ఫూర్తినిచ్చేందుకు కృషిచేసింది. తెలంగాణ ఎందుకు కావాలో చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలను లోతుగా విశ్లేషిస్తూ కథనాలు ప్రసారం చేసింది. తెలంగాణ ఇంక రాదంటూ అనుమానాలు పెరిగేలా రాష్ట్రంలో, ఢిల్లీలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొడుతూ, తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలన్నీ బట్టబయలు చేసింది. బలిదానాలు అవసరం లేదనీ, ప్రాణాలతో ఉండే తెలంగాణ సాకారం చేసుకుందామని యువతకు స్థైర్యాన్నివ్వడంలో కీలకపాత్ర పోషించింది. తెలంగాణ బిల్లు చివరిదశలోనూ అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొడుతూ... బిల్లు పాసయ్యే క్షణం వరకు ప్రజలకు ఎప్పటికప్పుడు నమ్మకమైన ప్రసారాలు అందించింది. అదే సమయంలో తెలంగాణ సాధనే లక్ష్యం. కానీ... తెలుగు ప్రజల మధ్య విభజన, విద్వేషాలు ఉండొద్దని పిలుపునిచ్చింది. రాష్ట్ర విభజన పేరుతో జనం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలనూ తిప్పికొట్టింది. చివరికి తెలంగాణ ప్రజల రాష్ట్ర కల సాకారమైంది. మన రాష్ట్రంలోనూ ప్రజల ఆకాంక్షలు, సమస్యలు తీరడానికి ఎప్పటిలాగే తన పాత్రను వీ6 కొనసాగిస్తోంది. తెలంగాణ సామాజిక, రాజకీయ చైతన్యానికి నిజాం కాలంలో ‘గోలకొండ’ పత్రిక పోషించిన పాత్రను తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో వీ6 న్యూస్ పోషించిందన్న ప్రశంసలు అందుకుంది.

మన ఉనికి.. మన పలుకుబడి

మన వేషభాషల గురించి, మన కట్టుబొట్ల గురించి, మన తిండి, భాష, వేడుకల గురించి ఏ పట్టింపూ లేకుండా చిన్నచూపు చూసే పరిస్థితి మీడియాలో ఉంది. తెలంగాణ బతుకు అంటే మీడియాలో వార్తలకు, రేటింగ్​కు పనికిరాదనే ముద్రవేశారు. ఈ వివక్షను బద్ధలు కొడుతూ మన ఉనికి చాటింది వీ6. వీ6 ఛానెల్‌‌ అనంగనే మొదలు గుర్తొచ్చేది మన ఉనికి, మన భాషే. బడిపలుకుల భాష కాదు... పలుకుబడుల భాష కావాలన్న కాళోజీ నారాయణరావు మాటను ఆచరణలో చూపించింది. మన కట్టుబొట్ల నుంచి మన తిండి వరకు అన్నింట్లోనూ తెలంగాణకు ప్రత్యేకమైన ఉనికి ఉందని నిరూపించింది. మన ఊరిలో, మన ఇంట్లో ఎలా ఉంటామో, తింటామో, మాట్లాడతామో, ఎలాంటి బట్టలు కట్టుకుంటామో, సంబురాలు ఎలా చేసుకుంటామో అన్నీ చిన్న తెరపై ఆవిష్కరించింది. అన్ని వార్తలు, కథనాల్లోనూ సూటిగా, పలుకుబడుల పదాలతోనే అందించడం అలవాటుగా మార్చుకుంది. ఇలా కూడా వార్తలు రాయొచ్చని, జనానికి వార్తలు అర్థమయ్యేలా ఉంటేనే జర్నలిజం లక్ష్యం నెరవేరుతుందని నిరూపించింది. 

తెరనిండా తెలంగాణ సంబురమే

ఉన్నంతలోనే దావత్. పండుగొస్తే సంబురం. జాతరొస్తే సందడి. కులమతాలు వదిలి కలిసిమెలిసి ఆడిపాడడమే తెలంగాణ బతుకుబాట. మన బతుకుల నుంచి వేరుచేయలేని ఈ సంబురాన్ని ఏ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కోట్లు.. లక్షలమంది కదిలొచ్చే మన పెద్ద పండుగలను కూడా పట్టింపులేని ఊరి జాతరలుగా పక్కనబెట్టేసిన పరిస్థితి. వీ6 రాకతోనే మనకున్న ఆ లోటు తీరిపోయింది. బోనాల నుంచి బతుకమ్మ దాకా, మేడారం నుంచి నాగోబా దాకా, ఎములాడ రాజన్న నుంచి ఆలంపురం జోగులాంబ వరకు, భద్రాద్రి రామన్న నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ వరకు ప్రతి పండుగ, ప్రతి జాతర, ప్రతి సంబురానికి వీ6 తెర వేదికగా మారింది. అప్పటివరకు టీవీల్లో పెద్దగా కనిపించని మన వేడుకలన్నీ చూసి జనం మురిసిపోయారు. హైదరాబాద్ బ్రాండ్ గణేశ్ సంబురాలు, నిమజ్జనం వేడుకలకు, మేడారం పెద్ద జాతరకు ప్రతిసారీ నాన్ స్టాప్ కవరేజ్ అందించి, జనం వేడుకలకు పెద్దపీట వేసింది. 

మానవీయం.. సామాజికం

జర్నలిజం అంటే మనకు నచ్చినట్లుగా, నచ్చిన భాషలో వార్తలివ్వడం కాదు. అందరికీ అర్థమయ్యేలా రాయాలన్నదే వీ6 విధానంగా పెట్టుకుంది. సూటిగా, స్పష్టంగా వార్తను వార్తలుగా అందించడంతో పాటు పాజిటివ్ జర్నలిజాన్ని ఎంచుకుంది. ప్రతి వార్తనూ నెగెటివ్​గానో, సమస్యగానో చెప్పడమే మీడియా ట్రెండ్. దీనికి భిన్నంగా సంఘటనల వెనుక అసలు కోణాన్ని పరిశీలించి, మంచిచెడులను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలన్న లైన్ తీసుకుంది. భార్యాభర్తల గొడవలను, ఇంటిగొడవలను, వ్యక్తిగత విషయాలను, మానవత్వం మీద నమ్మకాన్ని దెబ్బతీసే సంఘటనలను  బ్రేకింగ్‌‌లుగా వేసే దురాచారాన్ని దూరంపెట్టింది. మూఢనమ్మకాలు పెంచేవి, తప్పుదోవ పట్టించేవి, నిర్ధారణ కాకుండానే హడావిడి చేసే వార్తలపై పూర్తి నియంత్రణ పెట్టింది. ప్రతిదానికీ జనాన్ని భయపెట్టేలా కాకుండా అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా లాంటి విపత్తు సమయంలో దాదాపు రెండేండ్ల పాటు జనం ఇంటికి పరిమితమై ఉన్నప్పుడు, ఏదో అయిపోతుందని ప్యానిక్‌‌కు గురిచేయకుండా అవగాహనతో జాగ్రత్తలు తీసుకునేలా కథనాలను అందించింది. అందుకే కరోనా కాలంలో ఎక్కువమంది చూసిన ఛానెల్‌‌గా నిలిచింది. 

అన్ని వర్గాలూ సమానమే

కొన్ని సంఘటనలను బట్టి ‘పోలీసులు, డాక్టర్లు లాంటివాళ్లంతా ఇంతే’ అనుకునే జనరలైజ్డ్ అభిప్రాయాలను జనం నెత్తిమీద రుద్దే ప్రయత్నాలు చేయలేదు. పోలీసులు, డాక్టర్లు సహా సమాజంలో భాగంగా ఉండే అన్ని వర్గాలపైనా గౌరవం పెంచేలా కథనాలను అందిస్తోంది. అట్లాగే సమాజంలో నిరాదరణకు గురయ్యే వర్గాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తోంది. 92 శాతం మంది వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలున్న మన తెలంగాణలో వివక్షకు చోటులేకుండా అందరికీ అవకాశాలు దక్కాలన్న ఆలోచనలకు పెద్దపీట వేస్తోంది. మీడియాలో ఎవరూ పట్టించుకోని నేరెళ్ల దళితుల సమస్య, రైతులకు సంకెళ్లు, గిరిజన బాలింతలను పసిబిడ్డలతో జైలుకు పంపించిన ఘటనలను వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి విధానంతోనే వీ6లో కథనం వస్తే మా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని సంపాదించుకుంది. 

జానపదాలు.. బతుకుపాటలు

తెలంగాణ బతుకులో భాగం జానపదం. పండుగ, పబ్బాలకు, సంతోషాన్ని, దుఃఖాన్ని కూడా పాటగా పాడుకుంటారు. అందుకే నాటి సాయుధపోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు కూడా పాటే చైతన్యానికి ఆయుధంగా మారింది. అదే పాటను మన పండుగల ప్రత్యేకతను చాటడానికి, యువతకు స్ఫూర్తినివ్వడానికి సాధనంగా ఉపయోగించింది వీ6. ఉద్యమానికి స్ఫూర్తినివ్వడానికి, ఆత్మహత్యలు వద్దని ధైర్యం నింపడానికి పాటలు కట్టించి జనం ముందుంచింది. తర్వాత ఏటా బతుకమ్మ పాటలు రూపొందించే కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఆ తర్వాత బోనాలు, ఇతర పండుగలకూ పాటలు అందించింది. వీ6 స్ఫూర్తితో అన్ని ఛానెళ్లు, ఇతర సంస్థలు, పార్టీల వాళ్లు కూడా పండుగలకు పాటలు కట్టించే ఒరవడి మొదలైంది. దీంతో ఏటా వందలాది పాటలు జనం ముందుకొచ్చాయి. తెలంగాణ వచ్చాక కొత్తతరం పాట ఎలా ఉండాలన్న చర్చకు వీ6 పాటలు స్ఫూర్తినిచ్చాయి. 2015 నాటి వీ6 బతుకమ్మ పాట ‘పచ్చపచ్చని పల్లె’ ఎవర్ గ్రీన్​గా నిలిచింది. పండుగ రోజుల్లో ఊరి అందాలను, ఇంటి అనుబంధాలను కళ్లకుకట్టి బతుకమ్మ పాటల్లోనే ప్రత్యేకంగా నిలిచింది. బోనాల కోసం రూపొందించిన ‘డోల్ డోల్ డోల్’ పాట కోట్లమందిని ఆకట్టుకుంది. పండుగలతో పాటు సందర్భాన్ని బట్టి హైదరాబాద్ విశిష్టతపై పాటను రూపొందించింది. తెలంగాణ మట్టిమనుషుల మనసు ఎట్లాంటిదో చెప్పే ‘మాది తెలంగాణ జాతి’ పాట కొత్తతరం పాటల్లో ప్రత్యేకంగా నిలిచింది.

ప్రజల పక్షం.. అసలైన ప్రతిపక్షం

తెలంగాణ రావడానికి ముందు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు. మన రాష్ట్రం రావడంతోనే ఒక వంతు పూర్తయింది. ఆ తర్వాత ఏ ఆకాంక్షలతో రాష్ట్రం తెచ్చుకున్నమో వాటిని చేరుకోవడం మరో ఎత్తు. అందుకే వార్తలను అందించే పాత్రకే పరిమితం కాకుండా ఉద్యమకాలంలో నిర్వహించిన పాత్రను బాధ్యతగా కొనసాగించింది వీ6. 

ప్రజల ఆశలు నెరవేరుతున్నాయా? లేదా? అన్న విషయంలో సమస్యలు, ఇబ్బందులపై ఉన్నది ఉన్నట్లుగా కథనాలను అందిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంచిచెడులను వివరించడంతో పాటు జనం సమస్యలను నిష్పక్షపాతంగా ప్రభుత్వం దృష్టికి తెస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు చేయాల్సిన పాత్రకు ఆస్కారం లేకుండా ‘అసలు ప్రతిపక్షమే లేదు, తెలంగాణలో ప్రతిపక్షాల అవసరమే’ లేదని మాట్లాడే పరిస్థితులు తలెత్తాయి. నచ్చినట్లుగా ఉద్యమచరిత్ర మార్చేసుకోవడం, అవసరానికి మాత్రమే సెంటిమెంట్‌‌ను వాడుకోవడం, అవసరం తీరాక ‘ఇంకా ఉద్యమమేంటి? ఉద్యమకారులెవరు?’ అనే అహంకారం తలెత్తింది. ‘‘జనానికి అసలు సమస్యలే లేవు.. ధర్నాలు, నిరసనల అవసరమే లేదు.. నోరెత్తితే లోపలేస్తాం..’’ అని బెదిరించే స్థితి వచ్చింది. మీడియా మొత్తాన్నీ గుప్పిట్లో పెట్టుకోవడం, ‘‘సర్కారు ప్రకటనలు ఇవ్వకుంటే మీరెట్ల బతుకుతారు’’ అనే స్థాయికి దిగజారింది. దాంతో ఉద్యమంలో ప్రజల తరపున నిలిచినట్లే ఇప్పుడూ ప్రజల తరపునే ప్రతిపక్ష బాధ్యతను వీ6 తలకెత్తుకుంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒకే ఒక్క ఛానెల్‌‌గా నిలిచింది. చాలా సందర్భాల్లో, జనం వ్యతిరేకతను గుర్తించైనా ప్రభుత్వం అనివార్యంగా పనిచేయాల్సిన పరిస్థితిని కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రైతులు, యువతతోపాటు నిరాశలో ఉన్న అన్ని వర్గాల గళాన్ని ఉన్నది ఉన్నట్లుగా వీ6 జనం ముందు ఉంచి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అందుకే హైదరాబాద్ వరద సాయం నుంచి హుజూరాబాద్ దళితబంధు ప్రకటన వరకు, పెనం మీంచి పొయ్యిలో పడేసినట్లు చేసిన ధరణి వెబ్‌‌సైట్ నుంచి ఇటీవల 80వేల ఉద్యోగాలపై స్టేట్‌‌మెంట్ వరకు వీ6 పాత్రను తెలంగాణ సమాజం గుర్తించింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తెరచాటు కుతంత్రాలు చేసినా, ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా జనం అండతోనే వీ6 ముందుకు సాగుతోంది.

తెలంగాణకు కొత్త వెలుగు

వార్తల ఛానెల్‌‌గా వీ6 తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తోందనడానికి జనం ఆదరణ తప్ప మరో రుజువు అవసరం లేదు. అయితే ఛానెల్‌‌గానే కాకుండా కొత్త తెలంగాణకు మరింత సమగ్ర సమాచారం అందించడానికి వార్తాపత్రిక అవసరం కూడా ఉందని వీ6 యజమాని, తెలంగాణ ఉద్యమకారుడు వివేక్ వెంకటస్వామి భావించారు. అలా పుట్టిందే ‘వెలుగు’ దినపత్రిక. ఛానెల్‌‌ సీఈవో, చీఫ్ ఎడిటర్‌‌‌‌గా తెలంగాణకు అద్దంలా వీ6ను నిలబెట్టిన అంకం రవి ఆధ్వర్యంలోనే ‘వెలుగు’ పత్రిక రూపుదిద్దుకుంది. వీ6 అడుగుజాడల్లో మూడున్నరేండ్ల కింద ప్రయాణం మొదలుపెట్టిన దినపత్రిక ఛానెల్‌‌లాగే తిరుగులేని జనాదరణ సంపాదించుకుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఫలాలు అందరికీ అందాలన్నదే లక్ష్యంగా ‘వెలుగు’ దినపత్రిక తక్కువకాలంలోనే తెలంగాణ ఇంటి పత్రికగా మారింది. కొత్త తెలంగాణలో ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా ప్రజలకు మరో సాధనంగా ‘వెలుగు’ నిలిచి, ఎదిగింది. 

మన ఊరి రోల్ మోడల్స్

తీన్మార్ వార్తలే కాదు అందులో వార్తలు చెప్పేవాళ్లు కూడా ప్రత్యేకమైన గుర్తింపుతో సెలబ్రిటీలుగా మారారు. తీన్మార్ కంటే ముందు కత్తి కార్తీక షోతో వీ6 కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. హైదరాబాదీ యాసతో కత్తి కార్తీక పేరుతెచ్చుకుంది. తర్వాత మొదలైన తీన్మార్‌‌‌‌లో రాములమ్మ, మల్లన్న ప్రత్యేక ముద్రవేశారు. మన ఊరి అమ్మాయిగా రాములమ్మ ఆకట్టుకుంటే, గోసిగొంగడి కట్టిన మల్లన్న మొదటిసారిగా వార్తల టీవీలో కనిపించి ఆకట్టుకున్నాడు. గిరిజన బిడ్డను సంప్రదాయ కట్టుబొట్టులో మంగ్లీ పేరుతో తెర మీదికి తెచ్చింది వీ6. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే పాత్రలో వీ6 తెరపై బిత్తిరి సత్తి ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. లచ్చవ్వ, మలక్​పేట యాదగిరి, సావిత్రి, సుజాత, పద్మ, రాధ, చంద్రవ్వ, ఆటోరాజు లాంటి వాళ్లంతా మన ఊరిలో, పట్నంలో, వాడలో ఎక్కడోచోట కనిపించేవాళ్లే. ఇలాంటి కామన్ పర్సన్స్‌‌ను తెరమీదికి తెచ్చి వార్తలు, ముచ్చట్లు చెప్పడం న్యూస్ టీవీల్లోనే మొదటిసారి. వీ6 గుర్తించి పేరుపెట్టి పరిచయం చేసినవాళ్లు తెలంగాణ సెలబ్రిటీలుగా ఎదగడం ప్రజలిచ్చిన గౌరవం.

నమ్మకమైన ఛానెల్ 

తెలంగాణ ఉద్యమం టైంలో మొదటిసారి వీ6 ఛానెల్‌‌ని చూశా. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ నిర్బంధాల వల్ల తెలంగాణ పేరు పలకడానికి కూడా భయపడుతున్న టైంలో ఉద్యమానికి అండగా నిలిచింది. చాలా జిల్లాల్లో జరుగుతున్న తెలంగాణ పోరాటాన్ని మా కళ్లకు కట్టేలా చూపించింది. అంతగా తెలంగాణ వాదం వినిపించని ఖమ్మం జిల్లా లాంటి చోట కూడా ఆ ఛానెల్‌‌లో వచ్చిన పాటల తోటి ఉద్యమకారులకు స్ఫూర్తి వచ్చింది. అప్పటి నుంచి వీ6  ఛానెల్‌‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయా. తీన్మార్ వార్తలతోటి తెలంగాణ యాసను, భాషను జనాల్లోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే చాలు మా ఫ్యామిలీ మొత్తం వీ6 చూస్తున్నం. ఏదైనా ఫంక్షన్లు, ఊరికెళ్లినప్పుడు తీన్మార్ చూడలేకపోతే తెల్లారి పొద్దున 8 గంటలకు వచ్చినప్పుడు  చూస్తం. ఎలక్షన్లప్పుడు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు వేరే ఛానళ్లల్ల బ్రేకింగులు వేసి హడావిడి చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చినా, అది నిజమా కాదా అని తెలుసుకునేటందుకు మా ఇంటిల్లిపాది వీ6 ఛానెల్‌‌నే చూస్తం. అట్ల అందరికీ వీ6 అంటే నమ్మకం. ఇక ఊర్ల బతుకమ్మలాడినా వీ6 పాటలు మోగాల్సిందే.
– మేడ ఎల్లయ్య, చిరుమర్రి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా

మా ఫ్యామిలీ ఛానెల్‌‌ 

వీ6 ఛానెల్‌‌ మా ఫ్యామిలీ ఛానెల్‌‌ అయింది. రెగ్యులర్‍ వార్తలు మొదలు తీన్మార్‍ వరకు చాలా బాగా అనిపిస్తయ్‌‌. ఇంట్లో అందరం కలిసి టీవీ చూసే టైం వచ్చిందంటే.. అందరి కామన్‍ టేస్ట్‌‌ వీ6. పదేండ్ల కింద ఛానెల్‌‌ వచ్చినప్పుడు ఇతర ఛానెళ్లు చూసిన అలవాటుకు ‘ఇదేంటి భాష ఇట్లుంది, డ్రెస్సింగ్‍ వెరైటీగా ఉంది’ అనిపించింది. అప్పటికి టీవీలో న్యూస్‍ చదివేవాళ్లు సూట్‍ వేసుకుని చదివేటోళ్లు. తీరా వీ6 చూస్తే.. వార్తలు చదివే విధానం, కట్టు, బొట్టు అంతా కొత్తగా అనిపించింది. అసలు వార్తలు చదివినట్టు కాకుండా మనిషి ఎదురుగా ఉండి మన ఇంట్ల ముచ్చట చెప్పుకున్నట్లే అనిపిస్తుంటుంది.

బ్రేకింగ్‍ న్యూస్‍ కాకుండా వాస్తవం చెప్తది 

ఏదైనా ఘటన జరిగిన సమయాల్లో హడావిడిగా బ్రేకింగ్‍ పేరుతో ఏదో ఒక ఇన్ఫర్మేషన్‍ ముందు పెట్టకుండా.. ఒక నిమిషం లేటైనా వాస్తవ సమాచారమేంటో చెప్తారు. అదే మాకు బాగా నచ్చుతుంది. ఎన్నికల ఫలితాలు, ఇంకేదైనా విపత్తులు వచ్చినప్పుడు అఫీషియల్‍ సమాచారం ఇస్తారు కాబట్టి ఛానెల్‌‌ అంటే నమ్మకం పెరిగింది. సంపుకునుడు.. పొడుసుకునుడు వంటి క్రైం కొంత తక్కువగా చూపిస్తరు.

అసలు సిసలు ప్రతిపక్ష పాత్ర 

దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా అధికార పక్షం ఎంత గట్టిగా ఉంటుందో.. ప్రతిపక్షం అంతే గట్టిగా ఉండాలె. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. తెలంగాణలో వీ6 అనేది ప్రజల తరఫున అసలు సిసలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. మీడియా అంటే అట్లనే ఉండాలె. తాన అంటే తందానా అంటే ఏం లాభం? ఉద్యమ సమయంలో వీ6 ఛానెల్‌‌ యాస, భాష, ఆట, పాటతో పాటు తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై డిబేట్లు పెట్టి జనాల్లో ఉద్యమం చేయాలనే ఊపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. రైతులు, స్టూడెంట్లు, ఆర్టీసోళ్లు, ఉద్యోగుల సమస్యలు.. కరోనా కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపడం ద్వారా వాళ్లకు న్యాయం జరిగేలా చూశారు. మొన్నటికి మొన్న నిరుద్యోగులు హమాలీ కూలీలుగా ఎలా మారుతున్నారో చూపించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్‍ నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వడంలో మేజర్‍ రోల్‍ పోషించింది. వీ6 ఛానెల్‌‌ నిజంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తోంది.  

లేడీస్‍కు ఇంపార్టెన్స్‌‌ ఇవ్వడం గ్రేట్‍

ఛానెల్లో మగవాళ్ల కంటే మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిగనిపించింది. రెగ్యులర్‍ న్యూస్‍ చదివేటోళ్లకుతోడు.. నాటి నుంచి నేటి వరకు కార్తీక, మంగ్లీ, సావిత్రి, రాములమ్మ, రాధ, పద్మ, చంద్రవ్వ ఇలా ప్రతి ఒక్కరు జనాలకు చాలా దగ్గరగా అనిపిస్తరు. మా కాలనీలో అమ్మాయిలు గల్లరగల్లర మాట్లాడినట్లే అనిపిస్తది. ఛానెల్లో మహిళల క్యారెక్టర్లు కూడా గౌరవప్రదంగా ఉంటయ్‍.  అలాగే బిత్తిరి సత్తి, సదన్న, ఆటో రాజు క్యారెక్టర్లతో కూడా న్యూస్‍ చెప్పించడం ఓ ఛాలెంజింగ్ టాస్క్‌‌.

బతుకమ్మ అంటే.. వీ6 పాటలే 

బతుకమ్మ ఆట పాటలంటే వీ6 ఛానెల్‌‌ రావడానికి ముందు వేరు. తర్వాత వేరు. ఏటా ఛానెల్‌‌ తరఫున షూటింగ్‌‌ చేసే ప్రతి పాట హైలైట్‍. పాటల్లో ఎక్కడచూసినా సంస్కృతి, సంప్రదాయం, కట్టు, బొట్టు, ప్రకృతి కనిపిస్తాయి. మ్యూజిక్‍ అయితే సూపర్‍ ఉంటది. రాష్ట్రంలో ఈ ఊరు ఆ ఊరనే తేడా లేకుండా బతుకమ్మ పండుగ వచ్చిందంటే వీ6 బతుకమ్మ పాటలే వినపడతాయి. ఆ పాటలు వినగానే ఎందుకో కాసేపు స్టెప్పులు వేయాలనిపిస్తుంది. మా ఇంట్లో, కాలనీలో, పిల్లల స్కూల్లో.. చివరికి వెయ్యిస్తంభాల గుడిలో, పద్మాక్షి గుట్ట దగ్గర కూడా ఇవే పాటలు పెడ్తరు. ఏటా కొత్త పాట కోసం ఎదురుచూస్తుంటాం.
- ముప్పిడోజు స్వాతిపవన్‍, రాంనగర్‍, హన్మకొండ

మన ఛానెల్ అనే ఫీలింగ్ వస్తది

వీ6 న్యూస్ ఛానెల్ లాంచ్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా. మన తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు సంప్రదాయాలు ఇందులో  కనిపిస్తాయి. పొద్దున లేవగానే అన్ని పేపర్లలో వచ్చిన వార్తలు చదువుతరు. ఆ తరవాత  రాజకీయనాయకులతో కలిసి  కరెంట్ అఫైర్స్ తో డిబేట్ పెట్టడం...  జనాలకు అర్థం అయ్యేట్లు చెబుతున్నరు. ఈ ప్రోగ్రామ్ చూస్తే చిన్న పిల్లవానికి కూడా సమస్య పట్ల పూర్తి అవగాహన వస్తుంది. ఇంక ఏ ఇతర  ఛానెల్లో ఇలాంటి అవకాశం లేదు. టీవీ పెట్టిన కొత్తలో జజ్జనకరే జనారే ప్రొగ్రామ్  వచ్చేది. చాలా బాగుండేది. ఛానెల్ క్లారిటీ చాలా బాగుంటుంది. కెమెరా వండర్ ఫుల్ గా ఉంటుంది. ఏదో ఒక పార్టీకి వంత పాడకుండా   ప్రజల పక్షం వహిస్తూ..  నిష్పక్షపాతమైన వార్తలు అందించే  టీవీ ఛానెల్​ అనిపిస్తది. నేను ఆర్టీసీ ఎంప్లాయి అని కాదు కనీ మేము ఉద్యమం చేసిన టైమ్ లో మాకు వెన్నుదన్నుగా నిలిచింది వీ6 ఛానెల్. ముఖ్యంగా మెడికల్ కు సంబంధించిన కొత్త విషయాలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్‌‌లో ఉంటారు. ఏ సీజన్ వస్తే ఆ సీజన్ లో ప్రతిసారి తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా సాంగ్స్ చేస్తారు. వాటి కోసం ఎదురు చూస్తుంటం. వీ6 విడుదల చేసిన సాంగ్స్ స్ఫూర్తితోనే తెలంగాణలో ఎంతో మంది కొత్త డైరెక్టర్లు, సింగర్లు, కళాకారులు బయటకు వచ్చారు. ఇందులో అతిశయోక్తి లేదు. నూరు శాతం అని కాదు.. 150 శాతం ఇదే ఛానెల్  చూస్తం. టీవీ ఆన్ చేస్తే ఈ ఛానెల్ మనది అనే ఫీలింగ్ అనిపిస్తది. రాత్రి న్యూస్ లో జాతీయ, అంతర్జాతీయ వార్తలు  మంచిగా వస్తాయి.   తీన్మార్  చూడకుండా నిద్రపోము.
- తిప్పర్తి ప్రభు, ఆర్టీసీ ఎంప్లాయి, కరీంనగర్

ఇది మీ ఛానెల్

జర్నలిస్ట్​గా మీడియాలో గతంలో తెలంగాణ వార్తలకు ఎంత ప్రాధాన్యం ఉండేదో నాకు బాగా తెలుసు. 2011లో ఉద్యమం కీలకదశలో ఉన్న సమయంలో తెలంగాణకు ఒక ఛానెల్‌‌ ఉంటే బాగుంటుందన్న ఆలోచనను ఉద్యమకారుడు, పారిశ్రామికవేత్త వివేక్ వెంకటస్వామి సాకారం చేశారు. పార్టీలకు అతీతంగా, తెలంగాణ ప్రజల ఛానెల్‌‌గా నిలబెట్టడానికి ఆయన పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్లే వీ6 పదేండ్లుగా జనం ఆదరణను నిలబెట్టుకుంటూ సక్సెస్‌‌ఫుల్‌‌గా ముందుకు సాగుతోంది. జనానికి అర్థమయ్యేలా, సూటిగా, ఉన్నది ఉన్నట్లు వార్తలు చెప్పడం, వారి బతుకులో మంచిచెడ్డలను చూపించడమే జర్నలిజం అని మేం నమ్మాం. లేనిపోనివాటికి జనాన్ని భయపెట్టకుండా, బతుకుపై నమ్మకం పెంచేలా, సమస్యలు తీర్చేలా వార్తలు ఉండాలన్నదే మా విధానం. పదేండ్లుగా అదే బాటలో ముందుకు సాగుతున్నాం. మనకు నచ్చింది చెప్పడం కాకుండా... వేసే ప్రతి వార్తలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం ఉందన్నదే ప్రధానం. ఇలాంటి జర్నలిజం ప్రజలకు మేలుచేసేది, నచ్చేది కావడం వల్లే ఛానెల్‌‌ను ఇంతగా ఆదరిస్తున్నారు. ఈ విజయంలో నాతో పాటు అనేకమంది సీనియర్ జర్నలిస్టుల నుంచి ట్రైనీ సబ్– ఎడిటర్ల వరకు ఎంతో మంది నడిచారు. ఇప్పుడు మాతో ఉన్నవాళ్లు, లేనివాళ్ల పాత్రను కూడా మేం గుర్తుచేసుకుంటున్నాం. మారుమూల పల్లె నుంచి వచ్చిన నేను మన ఇంట్లో మాట్లాడే భాషలోనే వార్తలు చెప్పాలనుకున్నా. ఆ ఆలోచనతో ‘తీన్మార్ వార్తలు’ మొదలుపెట్టాం. తీన్మార్ పాత్రలు కూడా ఊర్లలో చాలా కామన్‌‌గా కనిపించేవాళ్ల స్ఫూర్తితోనే రూపొందించాం. జనం ఆకాంక్షలు, ఆలోచనలకు తగినట్లుగా వార్తలివ్వడమే మా టీమ్ చేసే పని. ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా ధైర్యంగా పనిచేయగలిగేలా ఛానెల్‌‌ను ఆదరిస్తున్న జనం అందరికీ మా టీమ్ అందరి తరపున వందనాలు. ఇది మీ ఛానెల్. మీ ఛానెల్‌‌గానే నడుపుతామని మాటిస్తున్నాం.
- అంకం రవి, సీఈఓ, చీఫ్ ఎడిటర్ 

ఛానెల్‌‌ను నిలబెట్టిన అందరికీ థ్యాంక్స్‌‌

నేను మేనేజ్ మెంట్ పర్సన్ గానే కాదు, ఒక వ్యూయర్‌‌‌‌గా కూడా ఛానెల్‌‌ను ఫాలో అవుతా. నా రోల్ నిర్వహించడంతో పాటు కామన్ పర్సన్‌‌గా వీ6లో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. జనం వాయిస్ గానే ఛానెల్ ఉండాలన్నది మేనేజ్‌‌మెంట్‌‌గా మేం పెట్టుకున్న పాలసీ. ఇందులో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ రిప్రజెంట్ చేసేలా ఛానెల్ నడపడం వల్లే జనం ఆదరిస్తున్నారని మా నమ్మకం. ఇంత ఆదరణతో పదేండ్లు పూర్తిచేసుకోవడం చాలా గర్వంగా ఉంది. న్యూస్ మీడియాలో గవర్నమెంట్ యాడ్స్ ఇస్తేనే ఛానెల్ నడుస్తుంది, వాటిపైనే ఆధారపడాలన్నట్లుగా ఉండేది. అలా కాకుండా జనం ఆదరణ మంచిగ ఉంది. అందువల్లే ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా పనిచేసేలా ఛానెల్‌‌ ఎదిగింది. ఇంత స్ట్రాంగ్‌‌గా ఛానెల్‌‌ను నిలబెట్టిన జనం అందరికీ, పదేండ్లలో మాతో కలిసి పనిచేసినవాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఇప్పుడు ఎలాగైతే ఛానెల్ నడుస్తుందో అలాగే జనంతోనే, జనం ఛానెల్​గానే ఎప్పటికీ ఉంటుంది.
- వైష్ణవి గడ్డం, మేనేజింగ్ డైరెక్టర్  

::: కె. మురళీ కృష్ణ::: వెలుగు నెట్​వర్క్​ 

మరిన్ని వార్తల కోసం...

స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు