
- రూ.4 కోట్లతో ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద సర్కిల్
- అష్టవంకరలతో అధ్వానంగా డ్రైనేజీ
- మంత్రి ఫోకస్ చేసినా లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు
- అలర్ట్ కాకపోతే తప్పని సమస్యలు
హనుమకొండ/ ఎల్కతుర్తి, వెలుగు: 'గేట్ వే ఆఫ్ వరంగల్'గా, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల జంక్షన్ గా నిర్మిస్తున్న ఎల్కతుర్తి సర్కిల్ పనులు గందరగోళంగా సాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ ఫోకస్ పెట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద జంక్షన్ గా దీనిని నిర్మిస్తుండగా, చాలాచోట్ల పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయి. డ్రైనేజీలు ఎక్కడికక్కడ వంకలు తిరుగుతున్నాయి. కొన్నిచోట్ల కంటిన్యూటీ లేక నాలాలకు మధ్యలోనే బ్రేకులు పడ్డాయి. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం, ఆఫీసర్ల పట్టింపులేనితనం వల్లే పనుల్లో లోపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లు అలర్ట్ కాకపోతే భారీ వర్షాలు కురిస్తే వరద జంక్షన్ ను ముంచెత్తడంతో పాటు చుట్టుపక్కల కాలనీల్లోకి ప్రవహించే ప్రమాదం ఉన్నది.
ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద జంక్షన్..
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎల్కతుర్తి గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి జంక్షన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూడు జిల్లాలకు వారధిగా ఉన్న ఎల్కతుర్తి జంక్షన్ ప్రాధాన్యాన్ని గుర్తించి, కుడా ఫండ్స్ తో దానిని డెవలప్ చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు మంత్రి పొన్నం, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి జంక్షన్ పనులకు శ్రీకారం చుట్టగా, దాదాపు రూ.4 కోట్లతో వర్క్స్ చేపట్టారు. 178 అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇప్పటి వరకు హనుమకొండ బస్టాండ్ సమీపంలోని జంక్షన్ మాత్రమే పెద్దదనే పేరుండగా, ఇప్పుడు ఎల్కతుర్తి సర్కిల్ కు 'గేట్ వే ఆఫ్ వరంగల్'గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతి పెద్ద జంక్షన్ గా పేరు వచ్చింది.
ఇష్టారీతిన కరెంట్ పోల్స్.. వంకరటింకర డ్రైనేజీ..
ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్మెంట్ లో భాగంగా బస్టాండ్ సర్కిల్ లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు, గజిబిజిగా ఉన్న కరెంట్ స్తంభాల షిఫ్టింగ్ కోసం ప్రభుత్వం విద్యుత్తుశాఖకు రూ.21 లక్షలు చెల్లించింది. కానీ, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పోల్స్ షిఫ్టింగ్ పనులు చేపట్టారు. అలైన్ మెంట్ లేకుండా పనులు చేస్తున్నారని చుట్టుపక్కల ప్రజలు మొదట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పట్టించుకోక ఇష్టారీతిన పోల్స్ వేసుకుంటూ పోయారు.
కరెంట్ స్తంభాలను కొన్నిచోట్ల డ్రైనేజీ ఇటుగా, ఇంకొన్నిచోట్ల మురుగుకాల్వ అటుగా వేశారు. ఫలితంగా మురుగుకాల్వ బయట వేసిన స్తంభాలు ఫుట్ పాత్ మధ్యలో వస్తున్నాయి. ఇక్కడ డ్రైనేజీని కూడా ఇష్టమొచ్చినట్టు వంకరలు తిప్పారు. జంక్షన్ లో చేపట్టిన నాలాలపై స్లాబ్ లు పోయకపోవడంతో స్థానిక షాపుల యజమానులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. కర్రలు, ఇనుప ప్లేట్లతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని వ్యాపారాలు నడుపుకోవాల్సి వస్తోంది.
మేల్కోకపోతే ముప్పే..
మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.4 కోట్లతో పనులు చేపట్టగా, అడుగడుగునా లోపాలు బయటపడుతున్నాయి. జంక్షన్ మధ్యలోని సర్కిల్ కు క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడంతో ప్రారంభానికి ముందే పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో సర్కిల్ మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి మున్ముందు ముంపు ముప్పు పొంచి ఉంది. ఆయా పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు పత్తా లేకుండా పోయారు. జంక్షన్ వద్ద నడిరోడ్డుపై గుంతలు ఏర్పడటం, రూట్ సైన్ బోర్డులు లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జంక్షన్ పనుల్లో ఇప్పటికైనా లోపాలను సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మెదక్ నుంచి ఎల్కతుర్తి (ఎన్హెచ్-765 డీజీ) వరకు నిర్మిస్తున్న రోడ్డు వెంట ఎల్కతుర్తి జంక్షన్ వరకు రెండు మీటర్ల వెడల్పుతో నాలా నిర్మించాల్సి ఉంది. ఆ కాల్వ ఎల్కతుర్తి జంక్షన్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వన్ మీటర్ డయా కాల్వతో అటాచ్ అవ్వాలి. కానీ, కాల్వ పనులకు స్థానిక సుకినె సుధాకర్ రావు ఇంటి వద్ద బ్రేకులు పడ్డాయి. దానిని కలుపుతూ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ మధ్యలోంచే వర్క్స్ స్టార్ట్ చేశారు. దీంతో 2 మీటర్ డయా కాల్వ నుంచి వచ్చే నీళ్లు కొద్దిపాటి వర్షం పడినా ఎల్కతుర్తి జంక్షన్ లోకి పరుగులు తీస్తున్నాయి. ఇక భారీ వర్షాలు పడితే జంక్షన్ తోపాటు చుట్టుపక్కల ఇండ్ల వైపు వెళ్తున్నాయి.
ఎల్కతుర్తి ఊర చెరువులో ఎక్కువైన వాటర్ తో పాటు బస్టాండు, గొర్ల అంగడి, రైస్ మిల్ వాడ నుంచి వచ్చే వరద, మురుగు స్థానిక శీలం మల్లేశం ఇంటి వద్ద కరీంనగర్-వరంగల్ హైవే క్రాస్ అయి నేరుగా నాగుల చెరువు వైపు వెళ్తాయి. కానీ, ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన పనుల్లో సుబ్బారాయుడు ఇంటి ఎదుట నాలాను పూర్తిగా మూసేసి, డెడ్ కర్వ్ తో హనుమకొండ వెళ్లే వైపున్న నాలాకు మళ్లించారు. దీంతో భారీ వర్షాలు పడితే వరద హైవేపై ప్రవహించే అవకాశమున్నది.