
- యూఎన్‌జీఏలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్
యునైటెడ్ నేషన్స్: యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) వేదికగా పాకిస్తాన్ తీరును ఇండియా ఎండగట్టింది. నిషేధిత టెర్రరిస్టు సంస్థలకు పాక్ నిలయమని, టెర్రరిస్టులను పోషిస్తోందని మండిపడింది. 26/11 ముంబై దాడులకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. శుక్రవారం జరిగిన యూఎన్‌జీఏ 78వ హైలెవెల్ సెషన్‌లో కాశ్మీర్ అంశాన్ని పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ లేవనెత్తిన నేపథ్యంలో దీటుగా కౌంటర్ ఇచ్చింది. ‘రైట్ టు రిప్లై’ కింద యూఎన్‌లో ఇండియా పర్మినెంట్ మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గెహ్లాట్ బదులిచ్చారు. ‘‘అంతర్జాతీయ నిషేధిత టెర్రర్ సంస్థలకు, టెర్రరిస్టులకు పాకిస్తాన్ నిలయంగా మారింది. టెర్రరిస్టులను పోషిస్తోంది. సాకులు చెప్పే బదులు.. ముంబై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు సూచిస్తున్నాం. 15 ఏండ్లు అవుతున్నా బాధితులు న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు’’ అని ఘాటుగా స్పందించారు.
ఈ మూడు పనులు చేయండి
సౌత్ ఆసియాలో శాంతి కోసం మూడు చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు పెటల్ గెహ్లాట్ హితవు పలికారు. ‘‘మొదటిది.. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆపండి. టెర్రరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వెంటనే మూసేయండి. రెండోది.. అక్రమంగా స్వాధీనం చేసుకున్న భారత భూభాగాల నుంచి వెళ్లిపోండి. మూడోది.. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టండి” అని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లడాఖ్ రెండూ భారతదేశంలోని అంతర్గత భాగాలేనని మరోసారి స్పష్టంచేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు, అధికారం, అర్హత పాకిస్తాన్‌కు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలోని అత్యంత అధ్వానమైన మానవ హక్కుల రికార్డులు కలిగిన దేశం పాకిస్తాన్. ప్రత్యేకించి మైనారిటీలు, మహిళల హక్కుల ఉల్లంఘనలు ఘోరంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంవైపు వేలు చూపెట్టడానికన్నా ముందు తన సొంత ఇంటిని పాకిస్తాన్ చక్కదిద్దుకోవడం మంచిది’’ అని హెచ్చరించారు. భారతదేశానికి వ్యతిరేకంగా నిరాధారమైన ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ దుర్వినియోగం చేస్తున్నదని, ఈ విషయంలో ఆ దేశం హ్యాబిచ్యువల్ అఫెండర్ గా మారిందని ఎద్దేవా చేశారు.