3 నుంచి డ్రైవర్లు, క్లీనర్లకు వ్యాక్సినేషన్

3 నుంచి డ్రైవర్లు, క్లీనర్లకు వ్యాక్సినేషన్
  • రిస్క్ టేకర్లుగా గుర్తించి వ్యాక్సినేషన్
  • గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ 10వేల మందికి.. జిల్లాల్లో మరో 10 వేల మందికి చొప్పున వ్యాక్సినేషన్
  • కరోనా థర్డ్ వేవ్ వస్తే సిద్ధంగా ఉండాలి: అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం

హైదరాబాద్: జూన్ 3 నుంచి క్యాబ్ డ్రైవర్లు, ఆటో, లారీ డ్రైవర్లు, క్లీనర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీ ఆర్ కె భవన్ లో రిస్క్ టేకర్లలకు వ్యాక్సినేషన్ పై సమీక్ష జరిగింది. మంత్రి హరీష్ రావు, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ప్రజలు, సరుకుల రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న క్యాబ్, ఆటో, లారీ డ్రైవర్లకు, క్లీనర్లను రిస్క్ టేకర్ల కేటగిరీగా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించారు.

గ్రేటర్ హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ప్రతి రోజూ పది వేల మందికి వ్యాక్సిన్ వేయాలని, అలాగే జిల్లాల పరిధిలో ఉండే రవాణా రంగ రిస్క్ టేకర్లకు కూడా ప్రతిరోజు 10,000 మంది చొప్పున వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొదటి, రెండు దశల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి, చేసిన కష్ట నష్టాలను బేరీజు వేసుకుని భవిష్యత్తులో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున వైద్య శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.