ప్లానింగ్ లోపంతోనే వ్యాక్సిన్, ఆక్సిజన్ల కొరత

ప్లానింగ్ లోపంతోనే వ్యాక్సిన్, ఆక్సిజన్ల కొరత

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. డబుల్ మ్యుటెంట్ తోనే కేసులు పెరుగుతున్నాయనుకుంటే.... దేశంలో మూడో మ్యుటెంట్ విజృంభిస్తోందని సైంటిస్టులు హెచ్చరించారు. మరోవైపు గతేడాది విదేశాలకు భారీగా ఆక్సిజన్ ఎగుమతైనట్లు తేలింది. ప్లానింగ్ లోపంతోనే వ్యాక్సిన్, ఆక్సిజన్ల కొరత ఏర్పడిందన్నారు కాంగ్రెస్ లీడర్లు రాహుల్, ప్రియాంక.

రోజువారీ కేసులు 3 లక్షలకు చేరువయ్యాయి. 10 రాష్ట్రల్లోనే 76శాతం కేసులు, 86శాతం మరణాలున్నాయని కేంద్రం తెలిపింది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో పాటు రికవరీ రేటు పడిపోతోంది. ఇప్పటిదాకా డబుల్ మ్యుటెంట్ తోనే కేసులు పెరిగిపోతున్నాయనుకుంటే... దానికి ట్రిపుల్ మ్యుటెంట్ తోడైంది. మూడు వేరియంట్లు కలిసి మరో మ్యుటేషన్ జరిగిందని... దేశంలో కొత్తగా ట్రిపుల్ మ్యుటెంట్ విజృంభిస్తోందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్లోని వైరస్ వేరియంట్లు కలిసి ట్రిపుల్ మ్యుటెంట్ గా ఏర్పడ్డాయని మెక్ గిల్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ పాయ్ చెప్పారు. ప్రపంచ దేశాలపైనా ట్రిపుల్ మ్యుటెంట్ ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

దేశంలో గతేడాది కంటే రెట్టింపు యాక్టివ్ కేసులున్నాయన్నారు సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్. ప్రస్తుతం 13.82 శాతం యాక్టివ్ కేసులున్నట్టు చెప్పారు. దేశంలోని 146 జిల్లాల్లో పాజిటివిటీ రేట్ 15శాతానికి పైగా ఉందని చెప్పారు. 5 రాష్ట్రాల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులున్నాయన్నారు. మే 1 నుంచి వ్యాక్సిన్ కొత్త విధానం అమలు కానుందన్నారు. వ్యాక్సిన్ మెడికల్ షాపుల్లో దొరకదని... రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ అందిస్తాయన్నారు. కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన భయపడాల్సిన అవసరంలేదంటున్నారు దేశంలోని డాక్టర్లు. ఆక్సిజన్ శాచురేషన్ 94శాతానికి చేరినప్పటికీ డేంజర్ లేదంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా, నారాయణ హెల్త్ చైర్మన్ దేవీ శెట్టి, మేదాంతా హాస్పిటల్స్ చైర్మన్ నరేష్ ట్రెహాన్ మీడియాతో మాట్లాడారు. రెమ్ డెసివిర్ రామబాణం కాదని... అది అందరికీ అవసరం లేదన్నారు. రెమ్ డెసివిర్ ను మంత్రదండంలా పరిగణించొద్దన్నారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల ధరలను ప్రకటించింది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ హాస్పిటల్స్ కు అమ్మే ఒక్కో డోసు ధర 600 రూపాయలుగా నిర్ణయించింది. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే డోసు ధరను 400 రూపాయలుగా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ధరలతో పోల్చితే తమ వ్యాక్సిన్ డోసుల ధరలు అందుబాటులోనే ఉన్నాయని తెలిపింది సీరమ్ ఇనిస్టిట్యూట్. ఇక స్పుత్నిక్ V వ్యాక్సిన్ ఒక్కో షాట్ 750 రూపాయలుగా ఉంటుందని రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది.
 
కరోనా వైరస్ డబుల్ మ్యుటెంట్ వేరియంట్ పై భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ICMR ప్రకటించింది. కరోనా వైరస్ అయిన సార్స్ కోవ్-2 తో పాటు దాని కొత్త రకాన్ని కూడా కొవాగ్జిన్ నియంత్రిస్తోందని తెలిపింది. UK, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్ లపై కొవాగ్జిన్ ప్రయోగించగా... ఆ రకాలను వ్యాక్సిన్ అడ్డుకుంటోందని ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్  డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఇలాంటి టైంలోనూ దేశం నుంచి భారీగా ఆక్సిజన్ విదేశాలకు ఎగుమతైనట్లు తేలింది. 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి మధ్య ఇండియా నుంచి దాదాపు 9 వేల 301 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎగుమతైనట్లు తెలుస్తోంది. 2019-2020లో ఆర్థిక సంవత్సరంలో కేవలం 4 వేల 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఎగుమతి కాగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది డబుల్ అయింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్రం... దేశంలో డిమాండ్ అంతగా లేని డిసెంబర్, జనవరి నెలల్లోనే ఆక్సిజన్ ఎక్స్ పోర్ట్ అయిందని తెలిపింది. అది కూడా అవసరానికి మించి ఉన్న ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మాత్రమే ఎగుమతి చేసినట్టు తెలిపింది.
 
ప్రపంచంలో అత్యధిక ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్ ఒకటని... అలాంటప్పుడు ఆక్సిజన్ షార్టేజ్ ఎందుకు ఏర్పడిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఫస్ట్ వేవ్-సెకండ్ వేవ్ మధ్య 8-9 నెలల సమయం ఉందని, కానీ కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీరో సర్వేలో సెకండ్ వేవ్ ముప్పుందని తెలిసినప్పటికీ సౌకర్యాలు మెరుగుపరచలేదన్నారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ ఎగుమతయ్యాయని చెప్పారు. ప్లానింగ్ లోపంతోనే రెమ్ డెసివిర్, వ్యాక్సిన్ కొరత ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారని విమర్శించారు ప్రియాంక.

పెద్ద నోట్ల రద్దు తరహాలోనే వ్యాక్సినేషన్ వ్యూహాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారని గుర్తుచేశారు. సామాన్యులకు ఆర్థికంగా ఆరోగ్య పరంగా నష్టం జరుగుతోందన్నారు. చివరికి కొంత మంది పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మేలు జరిగేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.